100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

Shot of a young businessman experiencing stress during a late night at work

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ ఆ కల నిజమైతే ఎలా ఉంటుంది? చేతిలో ఏకంగా వంద కోట్లు ఉంటే లైఫ్ ఇంకెంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ రీసెంట్ గా ఒక ఎన్నారై రెడ్డిట్ లో షేర్ చేసిన తన అనుభవం చూస్తే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లు కాదనిపిస్తోంది.

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇతను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ తెలివిగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఏకంగా 100 కోట్ల రూపాయల (12 మిలియన్ డాలర్లు) ఆస్తులు కూడబెట్టాడు. జీవితంలో ఇంత డబ్బు చూస్తానని తానెప్పుడూ అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ అసలు కథ ఇండియా వచ్చాకే మొదలైంది.

ఉద్యోగం మానేసి ఇండియాలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో సెటిల్ అయ్యాడు. రోజుకు మూడు గంటలు జిమ్, స్పోర్ట్స్, ఆ తర్వాత పుస్తకాలు చదవడం, టీవీ సీరియల్స్ చూడటం, పిల్లలతో గడపడం.. ఇదీ ఆయన ప్రస్తుత దినచర్య. పని చేయడానికి మనుషులు, వంట వాళ్ళు, కోచ్‌లు అంతా అందుబాటులో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం లాంటి జీవితం. అయితే ఈ కంఫర్ట్ లైఫ్ మొదట్లో బాగానే ఉన్నా, రాను రాను ఒక తెలియని వెలితి వెంటాడుతోందని ఆయన వాపోతున్నాడు. రోజూ చేసే పని లేకపోవడం, ఆఫీస్ టెన్షన్లు లేకపోవడంతో జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోందట.

కొన్నిసార్లు బయట ప్రపంచాన్ని ఫేస్ చేయలేక గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండిపోతున్నానని చెప్పాడు. ఖాళీగా ఉండటం బోర్ కొడుతున్నా, మళ్ళీ ఆఫీస్ రాజకీయాలు, టార్గెట్ల రొప్పులోకి వెళ్లడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ప్రమోషన్లు, ఆఫీస్ టైటిల్స్ కంటే కుటుంబంతో గడిపే సమయమే ముఖ్యమని ఫిక్స్ అయ్యాడు. ఇతని పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డబ్బు స్వేచ్ఛను ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వలేదని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి వంద కోట్లు ఉన్నా లైఫ్ లో ఏదో ఒక అసంతృప్తి ఉంటుందని ఈ ఎన్నారై కథ చెబుతోంది.