నేరస్తులకు షాకిచ్చేలా ఏపీ పోలీసుల సరికొత్త పోలీసింగ్

కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు.. తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చొచ్చిన అంబోతుల మాదిరి వ్యవహరించే ముదరు నేరస్తులకు ఏపీ పోలీసులు తమ కొత్త పోలీసింగ్ తో షాకిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో చోటు చేసుకున్న రెండు సంచలన నేరాలకు సంబంధించి అనుమానితుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి.. తమదైన శైలిలో వారు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ఏలూరులో యువతిపై అత్యాచారం కేసు ఎంత సంచలనంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పులిగడ్డ జగదీఘు బాబు.. లావేటి భవానీ కుమార్.. వీరికి సహకరించిన ధనుష్ లను పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. వీరిని టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు జనాలు చూస్తుండగానే రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

తప్పుడు పనులు చేసినోళ్లకు షాకిచ్చేలా ఉన్న పోలీసు చర్యలతో ఎంతటోడైనా సరే.. చట్ట ప్రకారం చర్యలు ఖాయమన్న  సంకేతాన్ని ఇస్తున్నట్లుగా చెప్పాలి. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నిందులకు పదిహేను రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని జిల్లా జైలుకు తరలించారు. ఇదే తరహాలో ఏపీ పోలీసులు నెల్లూరు నగరంలోనూ వ్యవహరించారు. ఇటీవల మద్యం తాగిన కొందరు రోడ్డుకు అడ్డంగా బైకులు పార్కింగ్ చేసుకొని పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే.. బస్సు డ్రైవర్ హారన్ కొట్టి వాటిని తీయాలని చెప్పినందుకు.. బ్లేడ్లతో దాడి చేసిన దుర్మార్గం తెలిసిందే.

ఈ సంచలన కేసుకు సంబంధించిన నిందుతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి నెల్లూరు నగరంలో రోడ్ల మీద నడించారు. నెల్లూరులోని బోసుబొమ్మ వద్ద ప్రైవేటు బస్సు డ్రైవర్.. కండక్టర్ మీద బ్లేడ్ తో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు (మదన్, ఉప్పు శ్రీకాంత్, గండవరపు అజయ్, నితిన్, నక్క తేజ) ఇదే తరహాలో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. తప్పుడు పనులు చేసే ఈ తరహా ముదురు నిందితులకు ఈ తరహా షాకులు మరిన్ని ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.