స్టార్‌లింక్ రేట్లు వచ్చేశాయ్… నెలకు ఎన్ని వేలో తెలుసా?

ఎలన్ మస్క్ కంపెనీ ‘స్టార్‌లింక్’ ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుందా అని టెక్ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. ఇండియాలో తమ ఇంటర్నెట్ సేవల ధరలను కంపెనీ అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసింది. అయితే ఈ రేట్లు చూసి సామాన్యులు కాస్త షాక్ అవుతున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ కావడంతో మన రెగ్యులర్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ధరలు భారీగానే ఉన్నాయి.

స్టార్‌లింక్ రెసిడెన్షియల్ ప్లాన్ అంటే ఇంటి అవసరాలకు ధరను నెలకు ఏకంగా రూ.8,600 గా నిర్ణయించారు. కేవలం నెలవారీ బిల్లు మాత్రమే కాదు, కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా ఒక హార్డ్‌వేర్ కిట్ డిష్, రౌటర్ లాంటివి సెటప్ చేసుకోవాలి. దీనికోసం ఒక్కసారే రూ.34,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. కొత్తగా తీసుకునేవారికి సర్వీస్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేలా 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.

ఈ ఇంటర్నెట్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎండ, వాన, చలి ఇలా ఎలాంటి వాతావరణం ఉన్నా సిగ్నల్ డ్రాప్ అవ్వదట. 99.9% అప్ టైమ్ ఇస్తామని కంపెనీ గట్టి హామీ ఇస్తోంది. వైర్లు, కేబుల్స్ గొడవ లేకుండా కేవలం ప్లగ్ పెడితే చాలు ఇంటర్నెట్ ఆన్ అయిపోతుంది. ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతానికి ఇళ్లలో వాడే ప్లాన్ వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఆఫీసులకు, పెద్ద సంస్థలకు వాడే బిజినెస్ ప్లాన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అవి కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఆపరేషన్స్ స్పీడ్ చేయడానికి బెంగళూరు ఆఫీస్ కోసం ఇప్పటికే రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. పేమెంట్స్, అకౌంటింగ్ మేనేజర్ల కోసం లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు.

నెలకు ఎనిమిది వేలు అంటే మన దగ్గర జియో, ఎయిర్‌టెల్ ఫైబర్ వాడే వారికి ఇది తడిసి మోపెడు అవుతుంది. కానీ ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు మాత్రం ఇది నిజంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ధర ఎక్కువగా ఉన్నా, క్వాలిటీ, స్పీడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకునే వారు దీని వైపు చూసే అవకాశం ఉంది. మొత్తానికి మస్క్ ఎంట్రీతో ఇంటర్నెట్ మార్కెట్ హీటెక్కడం ఖాయం.