గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్ మాత్రం 25 మందికి మరణ శాసనం రాసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు గోవా సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.
తాటాకులే యమపాశాలు
సరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ క్లబ్ లోపల అలంకరణ కోసం వాడిన తాటాకులు క్షణాల్లో మంటలను వ్యాపింపజేశాయి. సిలిండర్ పేలుడు వల్లే ఇది జరిగిందని పోలీసులు చెబుతుంటే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారణం ఏదైనా, క్షణాల్లో క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది.
అసలే ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటంతో జనం భయంతో పరుగులు తీశారు. దారి తెలియక కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ వైపు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయారు. క్లబ్ వెనుక జలాశయాలు ఉండటం, దారి చిన్నగా ఉండటంతో ఫైర్ ఇంజన్లు కూడా 400 మీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పొగ కారణంగానే ఎక్కువమంది ఊపిరాడక చనిపోయారు.
అసలు ఆ క్లబ్ నిర్మాణం అక్రమమని తేలింది. దీనికి ఎలాంటి కన్‌స్ట్రక్షన్ లైసెన్స్ లేదని, గతంలోనే కూల్చివేత నోటీసులు ఇచ్చినా స్టే తెచ్చుకుని నడుపుతున్నారని సర్పంచ్ రోషన్ రెడ్కర్ చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా దీన్ని కట్టారు. ప్రభుత్వం ఈ ఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్లబ్ యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates