వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్ కప్ గురించి అప్పుడే చర్చలు పెట్టొద్దని మీడియాకు సూటిగా చెప్పారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్స్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ను వరల్డ్ కప్ రేసులో చూస్తామా? అన్న ప్రశ్నకు ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. “వరల్డ్ కప్ రావడానికి ఇంకా రెండేళ్లు ఉంది. అప్పుడే దాని గురించి ఆలోచించడం కంటే, ప్రస్తుతంలో ఉండటం ముఖ్యం” అని గంభీర్ కుండబద్దలు కొట్టారు.

ఈ సిరీస్ చాలా స్పెషల్. ఎందుకంటే రెగ్యులర్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో దూరమవడంతో ఈ యువకులకు ఛాన్స్ దక్కింది. దాన్ని వాళ్లు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నారు. రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీతో మెరవగా, వైజాగ్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) అజేయ శతకంతో జట్టును గెలిపించాడు.

రుతురాజ్ గురించి గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడారు. “రుతురాజ్ తనకు అలవాటు లేని పొజిషన్‌లో బ్యాటింగ్ చేశాడు. అయినా సరే ఒత్తిడిలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతను ఇండియా A తరపున ఆడిన ఫామ్ చూసే మేం ఈ అవకాశం ఇచ్చాం. దాన్ని అతను పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు” అని ప్రశంసించారు. రెండో వన్డే లో టీమ్ 40/2 కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్నింగ్స్ ఆడటం అతని క్వాలిటీని చూపిస్తుందని అన్నారు.

ఇక జైస్వాల్ గురించి మాట్లాడుతూ.. “టెస్టుల్లోనే కాదు, వైట్ బాల్ క్రికెట్‌లోనూ తనకు ఎంత టాలెంట్ ఉందో చూపించాడు. ఇది అతని కెరీర్ ఆరంభం మాత్రమే. జైస్వాల్, రుతురాజ్ ఇద్దరికీ క్రికెట్‌లో భారీ భవిష్యత్తు ఉంది” అని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వైజాగ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 39.5 ఓవర్లలోనే, ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలవగా, జైస్వాల్ ఫైనల్ మ్యాచ్ హీరోగా నిలిచాడు.