నిన్న రాంచీలో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టగానే, ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా వెళ్లి కోహ్లీ కాళ్ల మీద పడ్డాడు. ఇది చూడటానికి అభిమానంలా అనిపించినా, క్రీడా నిబంధనల ప్రకారం ఇది చాలా సీరియస్ ఇష్యూ. గతంలో సచిన్, ధోని, రోహిత్ శర్మల విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. ఫుట్‌బాల్‌లో రొనాల్డో, మెస్సీల దగ్గరకు ఫ్యాన్స్ పరిగెత్తడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ క్షణికావేశం తర్వాత ఆ ఫ్యాన్ పరిస్థితి ఏంటి? అతనికి జైలు శిక్ష పడుతుందా? అనే సందేహం చాలా మందికి వస్తుంది.
నిజానికి ఇలా అనుమతి లేకుండా మైదానంలోకి ప్రవేశించడాన్ని చట్టపరంగా ‘ట్రెస్ పాసింగ్’ అంటారు. మన దేశంలో అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అధికారం ఉంది. గతంలో ఆటగాళ్లు “వదిలేయండి పాపం” అని చెప్పడంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపేవారు. కానీ ఈ మధ్య రూల్స్ మరింత కఠినం చేశారు. ఇలా చేస్తే స్టేడియం నుంచి జీవితకాలం నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అయితే లక్షల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేస్తారు. కేవలం ఫ్యాన్ మాత్రమే కాదు, అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా ఇది పెద్ద తలనొప్పి. ఒక సామాన్యుడు అంత భద్రతను దాటి ప్లేయర్ దగ్గరకు వెళ్ళాడంటే అది కచ్చితంగా సెక్యూరిటీ వైఫల్యమే. దీనివల్ల ఆ రోజు డ్యూటీలో ఉన్న గార్డుల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టులు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే వాళ్లు ఫ్యాన్స్‌ని అంత దారుణంగా లాక్కెళ్తుంటారు.
ప్లేయర్స్ సేఫ్టీ పరంగా చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. వచ్చిన వ్యక్తి అభిమానా? లేక హాని చేయడానికి వచ్చాడా? అనేది ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. గతంలో టెన్నిస్ ప్లేయర్ మోనికా సెలెస్‌ను ఒక ఫ్యాన్ మైదానంలోనే కత్తితో పొడిచిన ఘటన క్రీడా ప్రపంచాన్ని వణికించింది. అందుకే ప్లేయర్స్ కూడా సడెన్‌గా ఎవరైనా దగ్గరకు వస్తే భయపడతారు. ఇది ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా, మ్యాచ్ సమయాన్ని వృథా చేస్తుంది.
అభిమానం హద్దుల్లో ఉంటేనే అందం. టికెట్ కొని గ్యాలరీలో ఉండి అరిస్తే అది సపోర్ట్.. కానీ ఇలా కంచెలు దూకితే అది నేరం. దీనివల్ల ఆ అభిమానిపై క్రిమినల్ రికార్డ్ నమోదైతే, భవిష్యత్తులో పాస్‌పోర్ట్, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది. కేవలం ఒక సెల్ఫీ కోసమో, షేక్ హ్యాండ్ కోసమో జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకోవడం అవసరమా అని యువత ఆలోచించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates