ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి ఈరోజు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో పాటు వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీచరణి, మిథాలి రాజ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు.
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం శ్రీచరణికి విజయవాడలో ఈరోజు ఉదయం ఘన స్వాగతం లభించింది. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా సతీష్, టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.

ప్రత్యర్థులకు పదునైన బంతులతో చుక్కలు చూపించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి తెలుగుమ్మాయి కావడం మనందరికీ గర్వకారణం అంటూ మంత్రులు కొనియాడారు. వరల్డ్ కప్ లో 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచిన శ్రీచరణికి అభినందనలు తెలిపారు.
భావి భారత బాలికలకు కలలు కనే ధైర్యాన్నిచ్చిన విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి మున్ముందు మరిన్ని విజయాలతో ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నా అని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నారు. శ్రీచరణికి స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates