“ఆ ఎలుకలు మా పెట్స్”: రెస్టారెంట్‌ ఓనర్ షాకింగ్ ఆన్సర్

మధ్యప్రదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చేసిన తనిఖీల్లో వెలుగు చూసిన విషయాలు విని కళ్లు తేలేయాల్సిందే. అక్కడ వంటగదిలో కారుతున్న నూనె మరకలు, తెరిచి ఉంచిన ఆహారంపై వాలిన ఈగలు, పెరుగులో ఈదుతున్న కీటకాలు అధికారులను షాక్ అయ్యేలా చేశాయి. ఇంతటి అపరిశుభ్రతతో కూడిన ఆ కిచెన్‌లోకి అడుగు పెట్టిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు, ఏకంగా అక్కడ హాయిగా సంచరిస్తున్న ఎలుకలు కనిపించాయి.

అక్కడ కనిపించిన ఎలుకల గురించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి రాయ్ రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన జవాబు విని అధికారులు నివ్వెరపోయారు. “మేడమ్, ఈ ఎలుకలు మా పెంపుడు జంతువులు (Pets)” అని ఆ యజమాని చాలా తేలికగా సమాధానం చెప్పాడు. ఈ వింత వాదనతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సైతం బిత్తరపోయారు. రెస్టారెంట్‌లో ఇంత దారుణమైన అపరిశుభ్రత, మురికిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

వంటగదిలో చూసిన దృశ్యాలు అధికారులకు మైండ్ బ్లాంక్ చేశాయి. అంతా నూనెతో జిడ్డు పట్టిపోయి, ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉంది. ఆహారాన్ని భద్రపరిచే విధానంలోనూ తీవ్ర లోపాలు కనిపించాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ రెస్టారెంట్ నిర్వాకం అధికారులను ఆగ్రహానికి గురిచేసింది.

ఈ తనిఖీలో మరో ముఖ్య విషయం బయటపడింది. రెస్టారెంట్‌లో వాడకూడని గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడటం అధికారులు గుర్తించారు. దీని గురించి అడగ్గా, యజమాని “ఇది డొమెస్టిక్ సిలిండరే, రీఫిల్లింగ్ కోసం పక్కన పెట్టాను” అని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట్టరీత్యా నేరం. అపరిశుభ్ర వాతావరణం, ఎలుకల సంచారం, గృహ వినియోగ సిలిండర్ల వాడకాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు, టెస్టింగ్ కోసం వెంటనే ఆహార నమూనాలని సేకరించారు. వెంటనే ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆహార నమూనాల పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత, యజమానిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా, వంటగదిలోని లోపాలను ఏడు రోజుల్లో సరిదిద్దాలని యజమానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం వహించిన ఈ రెస్టారెంట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.