రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ కు ఉంటారా? గంభీర్ స్ట్రెయిట్ ఆన్సర్!

Kohli and Rohit Sharma
Kohli and Rohit Sharma

మొత్తానికి చాలా కాలం తరువాత టీమిండియా టెస్ట్ సీరీస్ లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవడంతో కోచ్ గంభీర్ మరోసారి హైలెట్ అయ్యాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఏమిటంటే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు ఏంటి? ముఖ్యంగా, 2027 వన్డే వరల్డ్ కప్‌లో వారు జట్టు ప్లాన్స్‌లో ఉంటారా లేదా అనే అంశంపై గంభీర్ చాలా సూటిగా, మొహమాటం లేకుండా స్పందించారు.

గంభీర్ ఈ విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ చెప్పిన దాన్నే రిపీట్ చేశారు. “వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నర సంవత్సరాల టైమ్ ఉంది. అందుకే, ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం” అని గంభీర్ అన్నారు. అంత దూరం గురించి ఆలోచించడం కంటే, ముందున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై ఫోకస్ చేయాలని ఆయన చెప్పారు. “వారు ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్. ఆస్ట్రేలియా టూర్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా” అని మాత్రమే ఆయన చెప్పారు.

ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఆడుతున్న ఏకైక అంతర్జాతీయ ఫార్మాట్ వన్డేనే. అయితే, రాబోయే రోజుల్లో వారి ఫామ్ ఎలా ఉంటుంది, ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే, 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు, కోహ్లీకి 38 ఏళ్లు ఉంటాయి. అందుకే, వారి దీర్ఘకాలిక ప్రణాళికల్లో వారు ఇమడగలరా లేదా అనే ప్రశ్నలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

రోహిత్, కోహ్లీ ఇద్దరూ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు.  ఆ టోర్నమెంట్‌లో రోహిత్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, కోహ్లీ కూడా టాప్ బ్యాటర్స్‌లో ఒకరిగా ఉండి జట్టు విజయాల్లో కీ రోల్ పోషించాడు. వారు బాగానే ఆడినప్పటికీ, రోహిత్ నుంచి కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించడం జరిగింది.

ఆస్ట్రేలియా సిరీస్‌కు వీరిద్దరిని ఎంపిక చేసినప్పటి నుంచే, వారి భవిష్యత్తుపై ఫ్యాన్స్, కోచ్‌లు, మాజీ క్రికెటర్లు అంతా డిబేట్ చేస్తున్నారు. అయితే, కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ప్రకటించడంతో, 2027 వరల్డ్ కప్‌కు అతనే లీడ్ చేయాలనేది బీసీసీఐ మేనేజ్‌మెంట్ ఆలోచనగా స్పష్టమవుతోంది. గంభీర్ కూడా ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం ద్వారా, కోహ్లీ, రోహిత్‌ల పట్ల ఎలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకుండా, కేవలం వారి ప్రస్తుత ఫామ్ ఆధారంగానే టీమ్ ఎంపిక ఉంటుందనే హింట్ ఇచ్చారు. మరి రాబోయే సిరీస్‌లో వారి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.