ఆసియా కప్ 2025లో భారత్‌పై వివాదాస్పద వైఖరితో నిలిచిన పాక్ మంత్రి మోసిన్ నక్వీకి ఇప్పుడు స్వదేశంలో గౌరవం దక్కబోతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గానూ, పాక్ ఇంటీరియర్ మినిస్టర్‌గానూ ఉన్న నక్వీకి దేశ ప్రభుత్వమే బంగారు పతకం ప్రదానం చేయాలని నిర్ణయించిందని పాక్ మీడియా వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్‌లో విమర్శలకు గురవుతున్నా, పాక్‌లో ఆయనను “జాతీయ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు”గా ప్రశంసలు కురుస్తున్నాయి.
కరాచీలో జరిగే ప్రత్యేక వేడుకలో నక్వీకి ‘షహీద్ జుల్ఫికార్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్’ ప్రదానం చేయనున్నట్లు సమాచారం. ఇది పాక్ రాజకీయాల్లో మరో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకకు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ముఖ్య అతిథిగా హాజరవనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ కార్యక్రమానికి తుది తేదీ ఇంకా నిర్ణయించలేదు. పాక్ క్రీడా సంఘాలు, ముఖ్యంగా సింధ్ మరియు కరాచీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్లు కలిసి ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఘులాం అబ్బాస్ జమాల్ అర్థం లేని ఎలివేషన్స్ ఇవ్వడంతో ట్రోలింగ్ కి దారితీస్తోంది. “మోసిన్ నక్వీ చర్యలతో దేశ గౌరవం తిరిగి నిలిచింది. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన ప్రదర్శించిన ధైర్యం దేశానికి గర్వకారణం” అని మాట్లాడడం విడ్డురం. గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆసియా కప్ ఫైనల్ అనంతరం నక్వీ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వివాదం సృష్టించింది.
ఫైనల్‌లో భారత్ విజేతగా నిలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నక్వీ చేతుల నుంచి ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించాడు. దీనికి ప్రతిగా నక్వీ ఆ ట్రోఫీని, విజేతల పతకాలను తన హోటల్ రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినప్పటికీ, భారత్ టీమ్‌కు అది ఎప్పుడు చేరుతుందన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లు, అంతర్జాతీయ మీడియా నక్వీ చర్యలను తీవ్రంగా విమర్శించాయి. క్రీడల్లో రాజకీయాలు కలపడం అనాగరిక చర్య అని అభిప్రాయపడ్డారు. కానీ పాక్ లోపల మాత్రం ఆయనను హీరోగా మలుస్తున్నారు. రాజకీయ వర్గాలు ఆయన “భారత్ ఎదుట తల వంచని నాయకుడు”గా చిత్రీకరిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates