దక్షిణాదిలో ప్రముఖ సంగీత సమ్రాట్, గానగంధర్వుడు ఎసపీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన సమయంలో అనేక సందేహాలు తెరమీదికి వచ్చాయి. కానీ, ఆయన కుమారుడు వాటిని తిప్పికొట్టి అధికారిక ప్రకటన చేసే వరకు అవి కొనసాగాయి. ఇప్పుడు అదే తరహా చర్చలు ఈశాన్య రాష్ట్రం అస్సాంనుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు జుబిన్ గార్గ్ (53) మరణం చుట్టూ జరుగుతున్నాయి.
జుబిన్ గార్గ్ అస్సాంలో జన్మించి, తన గాత్ర మాధుర్యంతో దేశానికీ, విదేశాలకీ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సంగీతానికి ఉన్న పాపులారిటీ ఆయన అంత్యక్రియల్లోనూ స్పష్టంగా కనపడింది. కిలోమీటర్ల దూరంలోని శ్మశానానికి ఆరు గంటలకు పైగా అంతిమ యాత్ర కొనసాగింది. వేలాదిమంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచో చేరుకుని కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇంతటి అభిమానాన్ని సాధారణ గాయకుడు పొందడం చాలా అరుదు.
అయితే, ఇప్పుడు జుబిన్ గార్గ్ మరణం కొత్త మలుపు తిరిగింది. గత నెల 19న ఆయన సింగపూర్లో పర్యటిస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించారని వార్తలు వచ్చాయి. మొదట ఇవి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. కానీ, ఆయన భార్య కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్తున్నప్పుడు ఎవరో ఆయన చేతిని పట్టుకుని నడిపించడం, తడబాటు వంటి ఘటనలు పెద్ద అనుమానాలకు దారితీశాయి.
ఇప్పుడీ కేసు కొత్త దిశలో దర్యాప్తు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, జుబిన్ గార్గ్ ఉన్నతిని తట్టుకోలేక ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ కావాలనే కుట్ర చేసి విషమిచ్చి చంపాడని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కోణంలోనే విచారణ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం దర్యాప్తు అధికారులు జుబిన్ గార్గ్ మరణం సహజం కాదని స్పష్టం చేస్తూ, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి సంగీతప్రేమికులను కలచివేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates