హైద‌రాబాద్‌: డ్రైనేజీలో కొట్టుకుపోయిన‌ మామా అల్లుడు

భాగ్య‌న‌గ‌రం హైదరాబాదు.. చిన్న పాటి వ‌ర్షానికే నీట మునుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఓ మోస్త‌రు వ‌ర్షానికి అయితే.. మోకాల్లోతు నీటిలో న‌గ‌రం మునిగిపోతోంది. అయితే.. తాజాగా ఆదివారం రాత్రి ఉన్న‌ప‌ళంగా భారీ వ‌ర్షం కురిసింది. కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే 12 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కుర‌వ‌డంతో న‌గ‌రం నీటిలో మునిగిపోయిన‌ట్టు అయింది. ఎటు చూసినా.. వ‌ర‌దదుస్థితి క‌ళ్ల‌కు క‌ట్టింది. లోత‌ట్టు ప్రాంతాల నుంచి ఉన్న‌త‌స్థాయి ప్రాంతాల వ‌ర‌కు కూడా నీట మునిగాయి. ఇక‌, గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైర‌తాబాద్‌, పాత‌బ‌స్తీల్లోని ఇళ్ల‌లో నీరు చేసి వ‌స్తువులు, నిత్యావ‌స‌రాలు కొటుకుపోయాయ‌ని బాధిత కుటుంబాలు తెలిపాయి.

ఇక‌, ఈ భారీ వ‌ర్షంలో మామ , అల్లుళ్లు డ్రైనేజీలో ప‌డి కొట్టుకుపోయారు. మ‌రో ప్రాంతంలో ఓ యువ‌కుడు గోడ‌కూలిన ఘ‌ట‌న‌లో కాలువ‌లో ప‌డి కొట్టుకుపోయాడు. దీంతో వారి కోసం.. తెల్లార్లూ వెతికినా.. ఎలాంటి ఫ‌లితం ల‌భించ‌లేదు. వంద‌ల కొద్దీ వాహ‌నాలు మొరాయించాయి. దీంతో స‌గానికిపైగా వాహ‌నాల‌ను అక్క‌డే వ‌దిలేసి.. వాహ‌న దారులు ఇళ్ల‌కు వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. ఎడ‌తెరిపి లేని వాన కార‌ణంగా.. సాధార‌ణ జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించింది. అయితే.. అదేస‌మ‌యంలో భార‌త్‌-పాక్ క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎక్కువ మంది ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. ర‌హ‌దారుల‌పై కిలో మీట‌ర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప‌లు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరి.. వాహ‌న దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రంగంలోకి మేయ‌ర్‌..

హైద‌రాబాద్ మున‌క‌నేప‌థ్యంలో మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి నేరుగా రంగంలోకి దిగారు. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఆమె జూబ్లీహిల్స్‌లో ప‌ర్య‌టించారు. అప్ప‌టికి కూడా మోకాల్లోతు నీరు కొన‌సాగుతూనే ఉంది. ఆ నీటిలోనే న‌డుచుకుంటూ.. సిబ్బంది సాయంతో ఆమె ప‌ర్య‌టించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆహారం అందించాల‌ని అధికారులను ఆదేశించారు. అనంత‌రం.. జీహెచ్ ఎంసీ కార్యాల‌యానికి చేరుకుని రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు న‌గ‌ర ప‌రిస్థితిపై అధికారుల‌తో స‌మీక్షించారు. మ‌రోవైపు మంత్రులు కూడా ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

దారుణ ఘ‌ట‌న‌లు ఇవీ..

+ హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా ల‌బించ‌లేదు.

+ ముషీరాబాద్‌లోని వినోబా కాలనీకి చెందిన సన్నీ (26) వ‌ర్షం కురిసిన త‌ర్వాత‌.. స్థానికంగా ఓ నాలా పక్కన ఉన్న గోడపై కూర్చున్న స‌న్నీ.. స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో అత‌ను నాలాలో పడి కొట్టుకుపోయాడు. స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది వచ్చి గల్లంతైన స‌న్నీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా.. ఆచూకీ ల‌భించ‌లేదు.