తిట్లు, బెదిరింపులు.. ఇప్పుడు నేరుగానే కాదు.. సోషల్ మీడియాలోనూ.. వస్తున్నాయి. గిట్టని వారిని తిట్టడం, బెదిరింపులకు దిగడం కోసం చాలా మంది సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అయితే .. ఇలా తిట్టినా.. బెదిరింపులకు దిగినా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వర్తించబోదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని కేసులుగా నమోదు చేయడం అంటే.. పోలీసులను తిరిగి చదువు కునేందుకు పంపించాల్సిన పరిస్థితిలో ఉన్నారని అర్ధమవుతున్నట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది.?
సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ.. తొలి వివాహం అనంతరం భర్తతో వేరు పడ్డారు. ఈ క్రమంలో వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో రెండో భర్తతోనూ ఆమెకు పొసగలేదు. దీంతో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత.. సదరు మహిళ.. రెండో భర్తను ఉద్దేశించి.. బండ బూతులు తిడుతూ.. బెదింపులకు పాల్పడుతూ.. వాట్సాప్, ఈమెయిళ్లలో పోస్టులు పెట్టారు. దీంతో చిర్రెత్తిన సదరు రెండో భర్త పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద సదరు మహిళ, ఆమె తండ్రి(ప్రేరేపించాడని)పై కేసులు పెట్టారు. అయితే.. ఈ కేసును కుమార్తె, తండ్రి హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు ఉటంకించారు. సోషల్ మీడియాలో తిట్టినా.. బెదిరింపులకు గురి చేసినా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడానికి వీల్లేదన్న గత సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి.. తమపై కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. దీనిని విచారించిన కోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
“ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కేవలం బహిరంగ ప్రదేశాల్లో జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. అది కూడా.. సాక్షులు ఉన్నారని భావించినప్పుడు మాత్రమే నమోదు చేయాలి. సాక్షులు లేరని తెలిసినా, నాలుగు గోడల మధ్య ఘటన జరిగినా ఎస్సీ, ఎస్టీ కేసు వర్తించదు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే అభిప్రాయపడింది. కాబట్టి.. ఈ కేసు కొట్టేస్తున్నాం. ఈ విషయంలో పోలీసులకు పరిజ్ఞానం లేకపోవడం దారుణం. వారిని చదువుకునేందుకు పంపించేస్థాయిలో ఉన్నారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates