జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విశ్వకర్మ విజయం సాధించారు. గత ఏడాది విజేత రియా సింఘా చేతులమీదుగా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక భారత్ తరఫున నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఘనత సాధించడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది.
ఈ పోటీల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు కూడా మంచి ప్రదర్శన ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. హరియాణాకు చెందిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయినప్పటికీ మణిక అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలగలిపిన సమాధానాలతో జడ్జీలను ఆకట్టుకుని కిరీటాన్ని దక్కించుకున్నారు.
మణిక విశ్వకర్మ వ్యక్తిగత జీవితం కూడా ప్రేరణాత్మకంగానే ఉంది. రాజస్థాన్‌లో పుట్టి, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సాధించారు. ఇప్పటికే మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను గెలుచుకుని తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సమాజ సేవ పట్ల కూడా మణిక ఆసక్తి చూపిస్తున్నారు. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి, న్యూరాలజీ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. అందం మాత్రమే కాకుండా, సమాజానికి సాయం చేయాలనే తపన కలిగి ఉండటమే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ఈ అంశం కూడా ఆమెను మిగతా పోటీదారుల కంటే ప్రత్యేకంగా నిలిపే అంశమైంది.
తన విజయంపై మణిక ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “నా ప్రయాణం గంగానగర్‌లో మొదలై ఢిల్లీ వరకు వచ్చింది. మనపై మనం నమ్మకం ఉంచుకుంటే ఏదైనా సాధ్యమే. నా విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు. రాబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ఎలా ప్రదర్శిస్తారన్నదే ఇప్పుడు అందరి ఆసక్తికరమైన ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates