ఆసియా కప్ 2025 టీమిండియా జట్టు ఇదే.. ఆ ఇద్దరు మిస్!

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ అజిత్‌ ఆగార్కర్‌, టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లు ఈ జాబితాను ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సెలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, శుభ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 

జస్ప్రీత్‌ బుమ్రా కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, శ్రేయాస్‌ అయ్యర్‌, యశస్వి జైశ్వాల్‌లకు మాత్రం ఈ సారి స్థానం దక్కలేదు. గిల్ కూడా ఉండడు అనుకున్నారు కానీ అతని నిలకడ జట్టుకు అవసరం అని తీసుకున్నారు. ఈ టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌తో పాటు అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. 

జట్టు సమతుల్యంగా ఉండేలా ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు పేర్కొన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్ ఉన్నారు. వీరితో పాటు మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రింకు సింగ్, హార్షిత్‌ రాణా వంటి కొత్త ప్రతిభావంతులు అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. జట్టులో వికెట్‌ కీపర్లుగా జితేష్‌ శర్మ, సంజూ శాంసన్ ఉన్నారు. వీరిద్దరికీ మ్యాచ్ పరిస్థితులను బట్టి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. 

ఫినిషర్ పాత్రలో రింకు సింగ్, శివమ్‌ దూబే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌కి తోడుగా హార్షిత్‌ రాణా కూడా రాణించగలడు ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, శ్రేయాస్‌ అయ్యర్‌, యశస్వి జైశ్వాల్‌లు జట్టులో లేని నిర్ణయం కొంతమంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

అయితే, సెలెక్టర్లు ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వడం భవిష్యత్తు కోసం మంచిదని పేర్కొన్నారు. భారత్‌ ఈ సారి ఆసియా కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. టీమిండియా లీగ్‌, సూపర్‌ 4తో కలిపి ఆరు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ హై వోల్టేజ్ పోరాటంగా మారనుంది. 

టీమిండియా జట్టు: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ సింగ్ రాణా.