హైదరాబాద్‌లో విద్యుత్ తీగల కారణంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం అందరిని కలచివేస్తోంది. పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా అంబర్‌పేట్‌లో రామ్‌చరణ్ అనే యువకుడు విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో విద్యుదాఘాత ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో జరిగిన కృష్ణాష్టమి ఉరేగింపులో రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. ఈ సంఘటనతో నగరం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
విద్యుత్ తీగలు రహదారులపై తక్కువ ఎత్తులో ఉండటం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఘటనలో రథాన్ని లాగుతున్న జీపు ఆగిపోవడంతో భక్తులు చేతులతో తోస్తూ ముందుకు తీసుకెళ్లారు. కానీ దాదాపు 50 అడుగుల దూరంలో వేలాడుతున్న విద్యుత్ తీగ రథానికి తగిలి షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా షాక్ తగిలి తొమ్మిది మంది కుప్పకూలారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురిని ఆస్పత్రికి తరలించినా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఇక నిన్న చోటు చేసుకున్న రెండు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీలో గణేశ్ విగ్రహం తరలింపులో విద్యుత్ తీగలను కర్రతో పైకెత్తే ప్రయత్నంలోనే షాక్ తగిలి మృతి సంభవించింది. అదే సమయంలో అంబర్‌పేట్ ఘటన కూడా సమాజంలో తీవ్ర ఆవేదన కలిగించింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ విద్యుదాఘాత ఘటనలపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. విగ్రహాల రవాణా, ఉరేగింపుల్లో విద్యుత్ శాఖ, పోలీసు శాఖ, మునిసిపల్ శాఖ సమన్వయంతో ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates