కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శుక్రవారం అద్భుతమే జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోగా… అది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆయనకు సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ చేసి బతికించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా వెంకన్నే కానిస్టేబుల్ రూపంలో వచ్చి… తన దర్శనం కోసం వచ్చిన భక్తుడి ప్రాణాలను కాపాడారని స్వామి వారికి గోవింద నామ స్మరణలు చేశారు. ఈ ఆసక్తికర ఘటన కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండల మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వెంకన్న దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదం తీసుకున్నారు. అనంతరం ప్రసాదం కౌంటర్ల దగ్గర నుంచి తిరిగి వస్తున్న క్రమంలో శ్రీనివాసులు ఉన్నట్టుండి గుండెపోటుకు గురై… అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 61 ఏళ్ల వయసున్న శ్రీనివాసులు కుప్పకూలడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని అక్కడికి సమీపంలోనే ఉన్న తిరుమల వన్ టౌన్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగున శ్రీనివాసులు వద్దకు చేరిన గుర్రప్ప… ఆయనకు సీపీఆర్, ఆపై ఫస్ట్ ఎయిడ్ చేశారు. గుర్రప్ప సమయ స్ఫూర్తితో శ్రీనివాసులు ఒకింత కోలుకోగా… వెనువెంటనే ఆయనను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్విమ్స్ వైద్యులు తెలిపారు. తమకు ఎదురైన ఘటనను తలచుకుని వెంకటేశుడే శ్రీనివాసులును రక్షించారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుర్రప్ప సమయస్ఫూర్తినీ వారు కీర్తించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates