మహిళల పేకాట పార్టీకి పోలీసుల బ్రేక్..!

“ఎయ్‌.. ముక్కెయ్‌..” రంగంలోకి దిగిన‌ పేకాట రాయుళ్ల నుంచి వినిపించేమాట‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పురుష పుంగ‌వులు మాత్ర‌మే.. ఈ చ‌తుర్ముఖ పారాయ‌ణంలో మునిగి తేలుతున్నారనే విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా ప‌ట్టుబ‌డ‌డం.. పోలీసులు న‌గ‌దు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు పెట్ట‌డం కూడా కొత్తేం కాదు. కానీ.. ఇప్పుడు మ‌హిళా రాయుళ్లు కూడా.. తాము మాత్రం త‌క్కువ తిన్నామా? అని అనుకున్నారో ఏమో.. ఏకంగా అపార్టుమెంటులో ఓ ఇంటిని రెంటుకు తీసుకుని పేకాట‌కు వేదిక చేశారు.

రోజూ తెల్ల‌వార్లూ పేకాట ఆడుతూ.. ఎయ్ .. ముక్కెయ్‌.. అంటూ చిందులు తొక్కుతున్నారు. దీంతో విసిగిపోయిన పొరుగు ఫ్లాట్ల వారు.. పోలీసుల‌కు కంప్లెయింట్ చేయ‌డంతో గురువారం తెల్ల‌వారు జామున స‌ద‌రు ఫ్లాట్పై దాడులు చేసి.. మ‌హిళా పేకాట రాయుళ్లు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 22 వేల రూపాయ‌ల‌కు పైగానే.. సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇక‌, ఈ పేకాట గృహాన్ని నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాన నిర్వాహ‌కురాలి కోసం గాలిస్తున్నారు.

ఇంత‌కీ.. ఈ చ‌తుర్ముఖ పారాయ‌ణ ఘ‌ట్టం.. ఏపీలోని విశాఖ‌లో జ‌రుగుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. విశాఖ‌లోని ల‌లితా న‌గ‌ర్‌లో ఉన్న ఓ డ‌బుల్ బెడ్ రూం ఫ్లాట్‌లో జ‌రుగుతోంద‌న్నారు. ప‌క్కా స‌మాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల‌తో క‌లిసి.. సివిల్ పోలీసులు దాడులు చేశారు. పేకాట సంద‌ర్భంగా.. భారీ సౌండ్‌తో డీజే కూడా పెట్టుకున్న‌ట్టు తెలిపారు. మ‌ద్యం, ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాలను దాచి పెట్టార‌న్న సందేహాలు ఉండ‌డంతో మ‌రింత లోతుగా విచార‌ణ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇక‌, ఈ మ‌హిళా పేకాట రాయుళ్ల వ‌య‌సు 32-46 మ‌ధ్య ఉంద‌న్నారు.