చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట

Eenadu
Eenadu

ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన మీడియా సంస్థలకు ఈనాడుకున్న వ్యత్యాసం ఏమంటే.. తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్ని నెలాఖరులోనే ఇచ్చేస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో అయితే.. నెల చివరి రోజు ఆదివారం అయితే.. ఒకట్రెండు రోజుల ముందే జీతాలు ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈనాడు ఉద్యోగులు మహా గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే..నెలాఖరుకు మూడు నాలుగు రోజుల ముందే జీతాలు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి.

అంతే తప్పించి.. క్యాలెండర్లో నెల దాటిన తర్వాత ఉద్యోగుల జీతాలు వేయటం అన్నది లేదు. నాలుగైదేళ్ల క్రితం ఒకసారి సాంకేతి కారణాలతో కొందరు ఉద్యోగుల జీతాలు బ్యాంకు ఖాతాలో ఆలస్యంగా క్రెడిట్ కావటం జరిగింది. అది మినహా ఎప్పుడూ ఆలస్యమైంది లేదు. ఇందుకు భిన్నంగా కరోనావేళ.. చోటు చేసుకుందని చెబుతారు. ఏప్రిల్ చివరి రోజున ఇవ్వాల్సిన జీతాల్ని.. మే పదిన కానీ ఆ తర్వాత కానీ ఇస్తామన్న మాట చెప్పినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా మీడియా సంస్థల ఆదాయం భారీగా పడిపోవటం.. ప్రకటనలు.. లూజ్ కాపీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో సంస్థ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడిందని చెప్పాలి. ఇప్పటికే పలు మీడియా సంస్థలు జీతాల్లో కోత విధించిన వైనం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటివేళ.. నెలాఖరు రోజున కచ్ఛితంగా జీతాలు ఇచ్చే పేరున్న ఈనాడు సంస్థ చరిత్రలో తొలిసారి ఆలస్యంగా ఇస్తామన్న మాట వచ్చిందంటున్నారు. దీంతో.. జీతాలు పూర్తిగా ఇస్తారా? కొన్ని సంస్థల మాదిరి కోత పెడతారా? అన్నదిప్పుడు ఆ సంస్థలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు.