ట్రంప్ పాకిస్తాన్‌ పర్యటన.. రెండు దశాబ్దాల తర్వాత ఇలా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ను సందర్శించనున్నారన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్‌ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌ను వైట్‌హౌస్‌లో కలవడమే కాకుండా, ఆ తరువాత పాకిస్తాన్ పర్యటనను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇది జరిగితే, 2006లో జార్జ్ బుష్ వచ్చిన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చే రెండో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందుతారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం ఈ పర్యటనపై ఎలాంటి అధికారిక సమాచారం తమకు లేదని ప్రకటించింది. ఇదే సమయంలో ట్రంప్ భారత్‌కు కూడా రానున్నారన్న ఊహాగానాలు బయటకొస్తున్నాయి. రాయిటర్స్ నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్ పర్యటన అనంతరం ట్రంప్ భారత్‌కు రావొచ్చని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ పర్యటనల ప్రస్తావనల నడుమ భారత్-పాక్ మధ్య సీజ్‌ఫైర్ పై ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ప్రతిగా పాకిస్తాన్ భారత ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేయగా, భారత వాయుసేన కూడా పాక్ ఎయిర్ బేస్‌లపై కౌంటర్ దాడులకు దిగింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణగా ఓ ఒప్పందం జరిగినట్టు ప్రకటించగా, ట్రంప్ అదే రోజు సోషల్ మీడియా వేదికగా తానే ఈ సీజ్‌ఫైర్‌కు కారణమని ప్రకటించారు.

అయితే భారత్ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. ఈ సీజ్‌ఫైర్ పూర్తిగా డీజీఎంఓల ద్వైపాక్షిక చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ట్రంప్ మాత్రం “ఇండియా-పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద యుద్ధాన్ని ఆపానని”, “అది న్యూక్లియర్ స్థాయికి వెళ్లే ప్రమాదం కూడా ఉందని” పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య తాను ట్రేడ్ సంబంధాల ద్వారా యుద్ధాలను నివారించానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన నిజమైతే అది దక్షిణాసియా రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.