పాక్ కు గుడ్ బై: ఉబర్.. ఫైజర్.. షెల్.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్

ఉబర్.. ఫైజర్.. షెల్.. టెలినార్.. ఎలీ ఇల్లీ.. సనోఫి.. తాజాగా మైక్రోసాఫ్ట్. పేరున్న ఈ కంపెనీలే కాదు.. వేలాది కంపెనీలు ఇప్పుడు పాకిస్థాన్ కు గుడ్ బై చెబుతున్నారు. వీలైనంతగా లెక్కలు సెట్ చేసుకొని.. పాక్ దేశానికి ఒక దండం పెట్టి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నాయి. ఎందుకిలా? అంటే.. పాకిస్థాన్ లో వ్యాపారం చేయటం అంత సులువైన పని కాదు. అందుకోసం నానా తిప్పలు పడాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. యాపారంలో సంపాదించిన మొత్తాన్ని డాలర్ల రూపంలో మార్చి తమ దేశాలకు తరలించటం మరో సమస్యగా మారటంతో పాటు.. రాజకీయ జోక్యం అంతకంతకూ పెరిగిపోవటం.. సైన్యం పాలన నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు.. తమ పరిధిని కార్పొరేట్ కంపెనీల్లోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న నియంత్రణకు విదేశీ సంస్థలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్నాయి.

ఇలా దేశం నుంచి వెళ్లిపోతున్న బహుళజాతి సంస్థల జాబితా భారీగా ఉందని చెప్పాలి. 2023 సంవత్సరానికి పాక్ నుంచి దుబాయ్ లో 8036 సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.ఇవన్నీ కూడా పాకిస్థానే కంపెనీలేనని చెబుతున్నారు. పాక్ కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే.. బహుళ జాతి సంస్థల పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యాపారంలో సైన్యం పెత్తనం పెరగటం.. బోర్డుల్లోకి పాక్ ప్రభుత్వ మనుషులు చేరుతున్న వైనాలు పెరుగుతున్నాయి. వారి జోక్యం అధికమవుతోంది. దీంతో.. ఈ తలనొప్పులు భరించలేని బహుళజాతి సంస్థలు పాక్ నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి.

వ్యాపారంలో సాధించిన లాభాల్ని తమ దేశాలకు తరలించేందుకు తీవ్ర కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. మామూలుగా అయితే.. లాభాల్ని డాలర్ల రూపంలో మార్చేసుకొని తమ దేశానికి తరలించుకుంటాయి కంపెనీలు. అలాంటి పరిస్థితి పాక్ లో లేకపోవటంతో..పాక్ బ్యాంకుల్లోనే ఏళ్ల తరబడి మూలుగుతున్న దుస్థితి. దీంతో.. లాభాల్ని వెనక్కి తీసుకెళ్లని పక్షంలో ఎంత పెద్ద సంస్థ అయినా ఆ దేశంలో ఎందుకు ఉంటుంది? అందుకే బహుళ జాతి సంస్థలు దేశాన్ని వీడిపోతున్నాయి.

పాక్ లో కంపెనీల మీద బాదే పన్నుపోటు ఎక్కువగా ఉంటుంది. కార్పొరేట్ లాభాలపై పది శాతం సూపర్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు కూడా భారీగా ఉంటాయి. ప్రస్తుతం 11 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఏడాదిన్నర క్రితం వరకు 23 శాతం వరకు ఉండేవి. విదేశీ మారక ద్రవ్యం కొరత కూడా ఆ దేశాన్ని పట్టి పీడుస్తోంది. దీంతో.. బయట నుంచి ఏమైనా దిగుమతి చేసుకోవాలంటే డాలర్లకు భారీ రేటు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనుమతుల తలనొప్పులు ఎంత తక్కువ చెబితే అంత మంచిది.

ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. పాక్ లో ఏ ప్రభుత్వం తమ పదవీ కాలమైన ఐదేళ్లను పూర్తి చేసుకున్నది ఒక్కటి లేదు. సైన్యం తిరుగుబాటు చేయటం.. వారి హవా నడవటం లాంటి అంశాలతో కంపెనీలు విసిగిపోయి ఉన్నాయి. ఈ కారణంగా పాక్ లో తమ ఆపరేషన్లను ఆపేసి.. పెట్టాబేడా సర్దేసుకొని ఆ దేశానికి గుడ్ బై చెప్పేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.