అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు ఓ-1 వీసా కొత్త ఆశగా మారింది. హెచ్-1బీ వీసాల విషయంలో లాటరీ, పరిమితులు, రిజెక్షన్ల భయంతో ఎందరో నిరుత్సాహపడుతుంటే… అసాధారణ ప్రతిభను గుర్తించి ఇచ్చే ఓ-1 వీసా మాత్రం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో పనిచేస్తున్నవారూ, డిజిటల్ క్రియేటర్లు, అథ్లెట్లు ఇలా వివిధ రంగాల్లో ప్రతిభావంతులు అమెరికా వెళ్లేందుకు ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. మరిన్ని అవకాశాలు, తక్కువ నిరాకరణతో ఈ వీసా పట్ల ఆసక్తి పెరుగుతోంది.
ఈ వీసా అందరికీ అందుబాటులో ఉండదు. అయితే, ప్రత్యేకత ఉన్న వారికి మాత్రం ఇది చక్కటి మార్గం. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, స్పోర్ట్స్, ఆర్ట్స్ రంగాల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారు అర్హులు. అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించిన ఎనిమిది ప్రమాణాల్లో కనీసం మూడింటిని పూర్తిచేయగలిగిన వారికే వీసా మంజూరు అవుతుంది. అవార్డులు గెలుచుకోవడం, గుర్తింపు పొందిన ప్రాజెక్టులు చేయడం, ప్రముఖ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉండటం వంటి విషయాల్ని ఇందులో పరిగణించబడతాయి.
ఓ-1 వీసాలో లాటరీ ఉండదు. పైగా మొదట మూడు సంవత్సరాలకు ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించుకోవచ్చు. దీనివల్లే దీన్ని “లాటరీ లేని హెచ్-1బీ వీసా” అని కూడా పిలుస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ వీసా కోసం దరఖాస్తుల సంఖ్య రెట్టింపైంది. 2020లో 8,800కి పైగా వీసాలు మంజూరు కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 18,900 దాటింది. భారతీయులే ఈ వీసాను మూడో అత్యధికంగా పొందుతున్నారు. ముఖ్యంగా టెక్ రంగంలో పని చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఇప్పుడిక ఓ కొత్త సమస్య ముందుకొస్తోంది. వీసా దరఖాస్తులో సోషల్ మీడియా ఖాతాల వివరాలు తప్పనిసరి చేశారు. ఎవరైనా తమ సోషల్ మీడియా ఐడీలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే, అది అనుమానానికి దారి తీయవచ్చు. అమెరికా అధికారులు అభ్యర్థి ఆన్‌లైన్ ప్రవర్తనను కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. గతంలో చేసిన పోస్టులు, కామెంట్లు కూడా చూస్తున్నారు. అందుకే వీసా కావాలంటే, సోషల్ మీడియా కూడా నిఖార్సైనదిగా ఉండాలి.
ఇక గూగుల్, టెస్లా, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ కంపెనీలకు ప్రతిభావంతులను నియమించేందుకు ఓ-1 వీసా మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. హార్వర్డ్, కొలంబియా వంటి యూనివర్సిటీలలో పీహెచ్‌డీ విద్యార్థులు, ఫ్యాకల్టీలను కూడా ఈ వీసాతో నియమిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న కలలు కంటున్నవారికి ఇది మంచి మార్గం. అయితే సోషల్ మీడియాలో బాధ్యతగా ప్రవర్తించడం ఇకపై మరింత ముఖ్యమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates