టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. కారణం ఇదేనా?

శుక్రవారం రాత్రి కాస్త పొద్దు పోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంతో లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె (13) ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు.. జర్నలిస్టు సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైనా.. తెలంగాణ వాదం మీదా యాక్టివ్ ఉండే ఆమె ధైర్యం ఎక్కువన్న పేరుంది.

అలాంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవటం అందరిని విస్మయానికి గురి చేసింది. భర్తతో విడాకుల అనంతరం మరో వ్యక్తితో కలిసి ఉంటున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఆమె నివాసం ఉంది. కలిసి ఉన్న స్నేహితుడితో వచ్చిన మనస్పర్థలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఆమె సూసైడ్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు.

ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నారు. ఈ మధ్యన జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ గా గెలుపొందారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాం నగర్ లో ఉంటారు. పద్దెనిమిదేళ్లుగా తెలుగు మీడియాలో ఆమె జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ధాన్యముద్రలో ఉన్న తన ఫోటోను షేర్ చేసి.. “మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అన్న కోట్ ను యాడ్ చేశారు. ఆమె పరిచయమున్న వారంతా ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.