దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే ఐసీసీ ప్రపంచ ట్రోఫీని సాధించింది దక్షిణాఫ్రికా. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన ఆ జట్టు.. ఎట్టకేలకు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచ విజేతగా నిలిచింది. దీంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఆ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. ఈ అద్భుత ఘట్టం గురించి ఐసీసీ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా గెలుపు క్షణాలను, సంబరాలను బంధించి ఈ వీడియోను రూపొందించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ వీడియోలో ఏమాత్రం అవసరం లేని ఒక వ్యక్తిని ఇరికించి, అతణ్ని హైలైట్ చేయడమే తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. కొన్ని నెలల కిందటే ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా.
నిమిషం నిడివి కూడా లేని ఈ వీడియోలో.. దక్షిణాఫ్రికా కెప్టెన్బ వుమా రెండు మూడుసార్లు కనిపిస్తే.. జై షావి మాత్రం పదకొండు ఫ్రేమ్స్ వేశారు. ఈ వీడియో మొదలైందే జై షాతో. ముగింపులోనూ అతను కనిపించాడు. ఆటగాళ్లను, కెప్టెన్లను హైలైట్ చేయాల్సింది పోయి.. రకరకాల యాంగిల్స్‌లో జై షాను చూపిస్తూ.. అతణ్ని ఎలివేట్ చేస్తూ ఈ వీడియో సాగడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఇండియన్ ఫ్యాన్సే ఈ వీడియో మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన చేతుల్లో ఐసీసీ ఉన్నంత మాత్రాన క్రికెట్ సంబంధిత వీడియోల్లో తనకు ఎలివేషన్ ఇప్పించుకుంటారా అంటూ జై షా మీద మండి పడుతున్నారు. ఇక వేరే దేశాల వాళ్లకు ఈ వీడియో ఇంకెంత ఆగ్రహం తెప్పిస్తుందో అంచనా వేయొచ్చు.
జై షా ఎప్పుడూ క్రికెట్ ఆడింది లేదు. క్రికెట్ వ్యవహారాల్లో పరిజ్ఞానమూ ఉన్నట్లు కనిపించదు. అయినా సరే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు అనే ఏకైక అర్హతతో చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్లో చక్రం తిప్పుతున్నాడు. బీసీసీఐలో ఎందరో సీనియర్లు, గొప్ప అడ్మినిస్ట్రేటర్లు ఉన్నప్పటికీ.. వాళ్లందరినీ తోసిరాజని బీసీసీఐ కార్యదర్శి అయ్యాడు. రెండు పర్యాయాలు పదవిలో కొనసాగి.. ఆ వెంటనే ఐసీసీ ఛైర్మన్ అయిపోయాడు. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ లాంటి ప్రతిష్టాత్మక పదవి చేపట్టాక అయినా హుందాగా ప్రవర్తించకుండా.. తన సంకుచిత మనస్తత్వాన్ని, పబ్లిసిటీ పిచ్చిని బయటపెట్టుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates