టెస్ట్ క్రికెట్‌కు గర్వకారణమైన డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణపై భారత్ కలలు మరోసారి నెరవేరకుండానే ఆగిపోయాయి. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాబోయే మూడు వరుస టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కలేదు. బీసీసీఐ నూతన శక్తితో అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనూ, ప్రపంచ టెస్ట్ పోటీలకు లార్డ్స్ వేదికగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటికే 2021, 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్‌లో జరిగాయి. తాజా సమాచారం ప్రకారం, 2027 వరకూ ఈ సంప్రదాయం అలానే కొనసాగనుంది. ఐసీసీ సింగపూర్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో లార్డ్స్‌తోపాటు ఇతర ఇంగ్లండ్ వేదికలకు అధికారికంగా ఆతిథ్య హక్కులు అప్పగించనున్నారు. ఇది భారత్‌కు పెద్ద దెబ్బే.
జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో, క్రికెట్ ప్రియులు టెస్ట్ ఫైనల్స్‌కు భారత గడ్డపై వేదికలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ తాజా నిర్ణయం ఆ కలలను కుదిపేసింది. భారత్ వేదికలు, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరు తెచ్చుకున్నా, వాతావరణం, ప్రయాణ సౌలభ్యం పేరుతో భారత్‌కు అవమానంగా వేదికలు దక్కకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంగ్లండ్‌లో వర్షం తక్కువగా ఉండే జూన్ సీజన్, లార్డ్స్ మైదానానికి ఉన్న చారిత్రక నేపథ్యం, గ్లోబల్ కనెక్టివిటీ వంటివి ఈ నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇందులో రాజకీయ కారణాలు లేకపోవచ్చని చెప్పలేరు. ఐసీసీ పగ్గాలు జై షా చేతుల్లో ఉన్నా, భారత్‌ను ప్రధాన వేదికగా నిలబెట్టేందుకు ఆయన చొరవ చూపలేదన్న వాదన బయటకు వస్తోంది.
క్రికెట్‌లో భారత్ ప్రాభవం పెరుగుతున్న తరుణంలో కూడా ఈవెంట్‌లకు ఆతిథ్య దక్కకపోవడంపై బీసీసీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌కు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యం, ఆర్థిక స్థిరత, అభిమానుల ఆదరణ చూస్తే.. కనీసం ఒక ఫైనల్ అయినా భారత్‌లో జరగాల్సింది. కానీ తాజా పరిణామాలు చూస్తే, ఆ గౌరవం కోసం భారత్ ఇంకా కాసేపు ఎదురు చూడాల్సిందేనని అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates