బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేశ్ 11A సీటులో కూర్చుండడం ఓ వింత విషయంగా మారింది. కానీ ఇదే సీటు నంబరులో 26 ఏళ్ల క్రితం మరో ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఉన్నారని తెలిసి ఇప్పుడు అంతా విస్తుపోతున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రుయాంగ్‌సాక్ జేమ్స్ లోయ్‌చుసాక్ ఈ అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.
ఒక్కప్పుడు ఎవ్వరూ ఎంచుకోనంతగా 11ఏ సీటు ఇప్పుడు అదృష్టానికి ప్రతీకగా మారింది. బోయింగ్ విమానాల్లో విండో లేని ఈ సీటు సాధారణంగా అసౌకర్యంగా భావించేవారు. కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఈ సీటులో ఉన్న విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడటంతో ఇప్పుడు దీనిపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ప్రమాద సమయంలో ఈ సీటు బయటకి విసిరేయబడి ఉండొచ్చన్న విమాన విశ్లేషకుల అభిప్రాయంతో అది హాట్ టాపిక్‌గా మారింది.
అయితే రెండు వేర్వేరు దేశాల్లో, రెండు వేర్వేరు దశాబ్దాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకే సీటు నంబరులో ఉన్నవారు మాత్రమే ప్రాణాలతో బయటపడటాన్ని నెటిజన్లు “11A మిస్టరీ”గా చర్చించుకుంటున్నారు. 1998లో థాయ్ ఎయిర్‌వేస్ టీజీ261 విమానం సూరత్ థానీ వద్ద ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఆ విమానంలో 146 మంది ప్రయాణికులుంటే 101 మంది చనిపోగా, కేవలం 45 మందే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో ఒకరే రుయాంగ్‌సాక్. ఆయన అప్పట్లో 11A సీటులో కూర్చొన్నట్టు, తర్వాత వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలతో తేలిందని చెప్పారు.
ఇప్పుడు అహ్మదాబాద్ ఘటనలో విశ్వాస్ కూడా అదే 11A సీటులో కూర్చొని బ్రతికినట్టు తెలిసి తాను షాక్‌కు గురయ్యానన్నారు. అలాగే ఇది చూసి నా ఒళ్లు గగుర్పొడిచింది అంటూ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. ఆ ప్రమాదం తర్వాత తాను ఏళ్ల తరబడి విమానాల్లో ప్రయాణించలేకపోయానని, మానసికంగా పూర్తిగా క్షీణించానని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇక సోషల్ మీడియాలో అయితే ఒకప్పుడు ఎవరూ ఎంచుకోని 11A, ఇప్పుడు ఒక జీవితం ఇచ్చే సీటు.. అనే కామెంట్స్ హల్‌చల్ చేస్తున్నాయి. విమానాల్లో సీటు ఎంచుకోవడంలో ఇప్పుడైనా ప్రయాణికులు 11Aపై అభిప్రాయాన్ని మార్చుకుంటారా అనే ప్రశ్న ఊతం పడుతోంది. కాగా, రుయాంగ్‌సాక్ విశ్వాస్‌కు ధైర్యం చెబుతూ నీ కథ చూసి నాకు జ్ఞాపకాలు తిరిగొచ్చాయి, నువ్వు బలంగా ఉండాలి అంటూ ఓపెన్ మెసేజ్ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates