ఇండియాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంగా.. నిన్నటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్‌ను చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. కేవలం నిమిషంలోపే జనావాసాల మధ్య కుప్పకూలిపోవడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండడం గమనార్హం.
ఈ విషాదం చాలదన్నట్లు విమానం కూలిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ హాస్టల్లో సైతం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రయాణం అంటే అనేక జాగ్రత్తలు చేసుకుంటారు. విమానానికి సంబంధించి ప్రతిదీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు. అలాంటిది కనీసం నిమిషం ప్రయాణం కూడా పూర్తి కాకముందే రెండు ఇంజిన్లూ పని చేయకుండా పోయి విమానం కుప్పకూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని పలు థియరీలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే దేశంలో ఒక పెద్ద ప్లేన్ క్రాష్ జరగబోతోందని ఒక జ్యోతిష్యురాలు సోషల్ మీడియాలో ఒకటికి రెండుసార్లు పోస్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ‘ఆస్ట్రో షర్మిష్ట’ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో గత ఏడాది డిసెంబరు 24న ఒక పోస్టు పెట్టారు. అందులో కొత్త ఏడాదిలో విమానయాన రంగం పురోగతి సాధిస్తుందని చెబుతూనే.. ఒక ప్లేన్ క్రాష్ హెడ్ లైన్స్‌గా మారి పెద్ద షాకిస్తుందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా సరిగ్గా వారం కిందట కొన్ని ప్రెడిక్షన్స్ చెబుతూ.. మరోసారి ప్లేన్ క్రాష్ గురించి ప్రస్తావించారు.
ఇప్పుడు అహ్మదాబాద్ విషాదంతో ఆ రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఒకటికి రెండుసార్లు విమాన ప్రమాదం గురించి నొక్కి వక్కాణించడంతో.. ఇదేం దిక్కుమాలిన ప్రెడిక్షన్ అంటూ ఓవైపు ఆ జ్యోతిషురాలిపై విరుచుకుపడుతూ.. ముందే ఆమె ఇలా ఎలా చెప్పగలిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదం మీద విచారణలో భాగంగా ఈ జ్యోతిషురాలి మీద కూడా ఓ కన్నేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు..
Gulte Telugu Telugu Political and Movie News Updates