ఉగ్ర‌వాదులు-ఇంజ‌న్‌-సిగ్న‌ల్‌-ప‌క్షులు.. విమాన‌ ప్ర‌మాదంపై భిన్న‌వాద‌న‌!

గుజ‌రాత్‌లో సంభ‌వించిన ఘోర విమాన ప్ర‌మాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. క‌నీసం వారిని గుర్తించే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంస‌పు ముద్ద‌లు అందించ‌డం తప్ప ఏమీ మిగ‌ల్లేదు. ఇంత ఘోర విషాదం జ‌రిగి గంట‌లు గ‌డిచినా.. ఈ ప్ర‌మాదం ఎలా సంభ‌వించింద‌నే విష‌యం పై మాత్రం కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. పైగా.. అనేక వాద‌న‌లు ప్ర‌ముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

సాంకేతిక‌త‌లో దూసుకుపోతున్నామ‌ని చెబుతున్నా.. తాజా ప‌రిణామం దేశానికి, పౌర విమాన‌యాన రంగా నికి కూడా అనేక స‌వాళ్ల‌ను మిగిల్చింది. ప్ర‌ధానంగా ఈ విమాన ప్ర‌మాదంపై.. 4 కార‌ణాలు వినిపిస్తున్నాయి . 1) ఇంజ‌న్ విఫ‌లం కావ‌డం. విమానం బ‌య‌లు దేరిన త‌ర్వాత‌.. వేగం పుంజుకుని గ‌గ‌న త‌లం వైపు దూసుకుపోవాల్సి ఉంది. కానీ, అది నేల చూపులు చూస్తూ.. రాలిపోయింది. దీనికి ఇంజ‌న్‌లో త‌లెత్తిన కార‌ణ‌మే అయి ఉంటుంద‌న్న వాద‌న ఉంది. అయితే.. ఇది నిర్దార‌ణ‌కు రాలేదు.

పైగా ఢిల్లీ నుంచి బ‌య‌లు దేరిన‌ప్పుడు.. అన్నీ స‌రిచూసుకుని పంపించామ‌ని.. ఇంజ‌న్‌లో లోపం లేద‌ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్ర‌క‌టించింది. సో.. ఇంజ‌న్‌లో లోపం అనుమాన‌మే. ఇక‌,2) సిగ్న‌ల్ స‌రిగా లేక‌పోవ‌డంతోనే పైలెట్ న‌డ‌ప‌లేక‌పోయాడ‌న్న వాద‌న కూడా ఉంది. ఇలాంటి స‌మ‌యంలోనే ఆకాశంలో చ‌క్క‌ర్లు కొట్టించేందుకు పైలెట్‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తారు. మ‌రి అలా ఎందుకు చేయ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

నిపుణులు అనుమానిస్తున్న 3వ కార‌ణం.. ప‌క్షులు. ఒకేసారిగా గుంపుగా వ‌చ్చిన ప‌క్షుల స‌మూహం.. విమానాన్ని ఢీ కొట్టింద‌ని చెబుతున్నారు. కానీ, దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. విమానం కూలిపోతున్న‌ప్పుడు.. చుట్టుప‌క్క‌ల ఆకాశంలో ఎలాంటి ప‌క్ష‌లు క‌నిపించ‌లేదు. సో.. ఈ మూడు కార‌ణాలు కూడా.. ఎక్కడా ప‌క్కాగా అయితే లేవు. కానీ.. ప్ర‌మాదంలో 242 మంది మృతి చెందార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, దీనిపై 4వ కార‌ణం.. ఉగ్ర కుట్ర కూడా ఉంద‌ని మ‌రో అనుమానం త‌లెత్తింది. దీనిని కూడా కేంద్రం సీరియ‌స్‌గానే తీసుకుంది. ఆ కోణంలో కూడా.. ప‌రిశీల‌న చేస్తోంది.