హెచ్‌కేయూ5: ఇది కరోనా కంటే డేంజర్!

గబ్బిలాల్లో కొత్తగా గుర్తించిన హెచ్‌కేయూ5 అనే వైరస్ ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-కోవ్) కుటుంబానికి చెందిన ఈ వైరస్, కేవలం ఒక చిన్న జన్యు మార్పుతో మానవ కణాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో కోవిడ్ వంటి మహమ్మారులను విడుదల చేసిన గబ్బిలాలే ఇప్పుడు మరోసారి మానవాళిపై ముప్పుగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనకు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సహకారం అందించాయి. శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని ‘నేచర్ కమ్యూనికేషన్స్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించారు. ముఖ్యంగా హెచ్‌కేయూ5 అనే ఉపరకం, మానవ శరీరంలోని ఏసీఈ2 గ్రాహకాన్ని ఉపయోగించి కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉందని ప్రయోగాల్లో వెల్లడైంది. ఇదే గ్రాహకాన్ని కోవిడ్-19 సార్స్-కోవ్-2 వైరస్ కూడా ఉపయోగించింది.

ప్రస్తుతం ఈ వైరస్ గబ్బిలాల్లోని ఏసీఈ2 గ్రాహకానికి అత్యధిక అనుబంధం కనబరుస్తున్నప్పటికీ, మనుషుల్లోకి పూర్తిగా ప్రవేశించలేదని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. అయితే ఒక చిన్న మ్యూటేషన్ మార్పుతో ఇది కూడా మనుషులను ప్రభావితం చేయగలదన్న సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే మింక్స్ వంటి జంతువులకు ఇది వ్యాపించినట్లు గుర్తించడమైతే మానవులకు వ్యాపించడంలో మధ్యంతర దశగా భావిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ఆల్ఫాఫోల్డ్ 3 అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి వైరస్ స్పైక్ ప్రోటీన్ ఏసీఈ2 గ్రాహకంతో ఎలా సంకర్షించుతుందో విశ్లేషించారు. ఇది మహమ్మారుల ముందస్తు అంచనాలకు, వ్యాక్సిన్ అభివృద్ధికి ఉపయోగపడనుంది. హెచ్‌కేయూ5 ప్రస్తుతం నిశబ్దంగా ఉన్నా, అది ఎప్పుడైనా గమ్మత్తుగా మారే అవకాశం ఉన్నందున, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌పై అత్యంత జాగ్రత్తగా నిఘా కొనసాగించాలని సూచిస్తున్నారు.