ట్రంప్ కారణంగా అమెరికాలో పెరిగిపోతున్న టెన్షన్

అగ్రరాజ్యం అమెరికా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ వల్ల జస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఇబ్బందులు తప్పేలా లేదు. ఎందుకంటే మనకు లాగ ఎన్నికల ఫలితాలు రాగానే అధికారంలోకి వచ్చే పార్టీకి అధికారం అప్పగించే అవకాశం అమెరికాలో లేదు. తాజాగా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ బాధ్యతలు తీసుకునేది 2021, జనవరి 20వ తేదీన మాత్రమే. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి బాధ్యతలు తీసుకునేందుకు మధ్య 70 రోజుల వ్యవధి ఉంది. ఈ కాలాన్నే ట్రంపు వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది.

ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంపు వ్యవహార శైలి చూస్తుంటే కచ్చితంగా బైడెన్ కు ఇబ్బందులు సృష్టించవచ్చనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. అమెరికా జాతీయ భద్రతా మండలి మాజీ ఉన్నతాధికారి జెఫ్ మూన్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా చైనాను కచ్చితంగా శిక్షిస్తామంటు ట్రంప్ పదే పదే హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రంప్ హెచ్చరికలను ఎవరికి వారుగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపధ్యంలో తైవాన్ తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదంటు మూన్ అభిప్రాయపడ్డారు.

దీనికి అదనంగా చైనా కమ్యూనిస్టు నేతల వీసాల మీద కూడా ట్రంప్ నిషేధం విధించినా ఆశ్చర్యపోవక్కర్లేదన్నారు. పనిలో పనిగా 2022లో చైనాలోని బీజింగ్ లో జరిగే ఒలంపిక్స్ లో అమెరికా పాల్గొనకూడదంటూ ప్రకటించినా చేసేదేమీ లేదన్నారు మూన్. చైనాకు మిలిటరీ, టెక్నాలజీ ఎగుమతులను నిషేధించటం, అమెరికాలోని చైనా కంపెనీలను నిషేధించటం, చైనా యాప్స్ ను బ్యాన్ చేయటం లాంటి నిర్ణయాలను ట్రంపు తీసుకుంటే కొత్తగా ఎన్నికైన బైడెన్ కు చాలా ఇబ్బందులు తప్పవని మూన్ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

తాజాగా జరిగిన ఎన్నికల్లో తనపై బైడెన్ సాధించిన ఘన విజయాన్ని ట్రంపు అంగీకరించలేకపోతున్నారు. దాంతో బైడెన్ పై ట్రంపు కసితో రగిలిపోతున్నట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే బైడెన్ గెలుపుపైన ట్రంపు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో తానే గెలిచానని, బైడెన్ గెలుపు పూర్తిగా ఇల్లీగలని, ఎన్నికల జరిగిన తీరుపై కోర్టులో కేసు వేసినట్లు ట్రంపు చేసిన ప్రకటనలన్నీ బైడెన్ పై పగ తీర్చుకునేట్లే ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. మరి ఈ 70 రోజుల్లో ట్రంపు అమెరికా తలరాతను ఏ విధంగా రాస్తాడో లేకపోతే మారుస్తాడో చూడాల్సిందే.