రూ.500 నోట్లను 2026 మార్చి నుంచి పూర్తిగా రద్దు చేయబోతున్నారని.. ఇటీవలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ “క్యాపిటల్ టీవీ” విషయాన్ని మరింత వేగంగా విస్తరించింది. దాదాపు 4.5 లక్షల మంది వీక్షించిన ఆ వీడియో వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది.
అయితే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ – “ఇది పూర్తిగా అవాస్తవం, ఇలాంటి నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకోలేదు” అని తేల్చిచెప్పింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయనీ, వాటి ఆమోదం ఎక్కడా తగ్గబోదనీ స్పష్టం చేసింది.
ఆర్‌బీఐ వెబ్‌సైట్ లేదా ప్రముఖ మీడియా సంస్థల సమాచారం ద్వారా పరిశీలించినా, నోట్ల రద్దుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని స్పష్టమైంది. పీఐబీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా ఈ విషయం తేల్చింది. ప్రజలు ఇలా వచ్చే నకిలీ కథనాలను నమ్మొద్దని, అధికారిక వేదికల నుంచే సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మధ్య ఏటీఎంల నుంచి చిన్న డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తేవాలని ఆర్‌బీఐ చేసిన సర్క్యులర్ వల్లే ఈ అపోహలు మొదలయ్యాయని భావిస్తున్నారు. కానీ అది కేవలం రూ.100, రూ.200 నోట్ల లభ్యతను పెంచేందుకే, రూ.500 నోట్ల రద్దుతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.