పిన్ కోడ్.. ఈ మాట తరచుగా వింటూనే ఉంటాం. పోస్టల్ డిపార్ట్‌మెంటు ఖచ్చితంగా పిన్‌కోడ్‌పైనే ఆధార పడి పనిచేస్తుంది. ఒక ఉత్తరం చేరాలన్నా.. ఒకకొరియర్ రావాలన్నా.. పిన్ కోడ్ ముఖ్యం. అంతేకాదు.. ఇప్పుడు రుణాలు తీసుకునేందుకు కూడా.. ప్రైవేటు బ్యాంకులు `పిన్ కోడ్`ను ఖచ్చితం చేశాయి. తద్వారా.. ఆయా పిన్ కోడ్‌ల పరిధిలో రుణ గ్రహీతల పరపతి ఎలా ఉందన్నది అంచనా వేస్తున్నాయి. ఇలా.. పిన్ కోడ్ దైనందిన లావాదేవీల్లో కీలకంగా మారింది.
అయితే.. ఇప్పుడు ఈ పిన్‌కోడ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వెర్షన్ తీసుకువస్తోంది. దీనినే `డిజి పిన్`గా వ్యవహరిస్తారు. మారుతున్న కాలానికి.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అన్ని మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగానే.. ఈ పిన్‌కోడ్ విషయంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజి పిన్ ద్వారా.. మరింత ఖచ్చితత్వంతో మనకు కావాల్సిన ప్రాంతాలను.. ఇళ్లను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని.. ఎవరినీ సంప్రదించకుండానే.. మనం కోరుకున్న అడ్రస్‌కు చేరుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
ఇండియన్ పోస్టు ఆఫీసు, ఐఐటీ హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఇస్రో)లు సంయుక్తంగా డిజిపిన్ ను అభివృద్ధి చేశాయి. `ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ`గా దీనిని పేర్కొంటున్నారు. దీని ప్రకారం.. దేశాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. సుమారు 10 నుంచి 15 ఇళ్లకు ఒక డిజిపిన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా.. ప్రతి గ్రిడ్‌కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ ను జీపీఎస్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా.. అత్యంత వేగంగా.. సునాయాసంగా కోరుకున్న ప్రాంతాలకు చేరుకునే సౌకర్యం ఏర్పడుతుంది.
డిజిపిన్‌లో ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన 10 అక్షరాల నెంబర్ కేటాయిస్తారు. ఇది దేశంలో డిజిటల్ అడ్రస్సింగ్ విధానాన్ని సమూలంగా అందివచ్చేలా చేస్తుంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సమర్థవంతంగా అందనున్నాయి.