ట్రంప్‌ దెబ్బకు ఎలాన్ మస్క్ కొత్త పార్టీ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాలు అక్కడి రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీశాయి. కొంతకాలం క్రితం వరకు ట్రంప్‌కు మద్దతుగా నిలిచి, రాజకీయ ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన మస్క్.. ఇప్పుడు ఆయన్ని తప్పుబడుతూ స్వతంత్ర రాజకీయ ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి తప్పుకున్న మస్క్, ట్రంప్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు పలుమార్లు సంకేతాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ నిర్వహించిన తాజా ఆన్‌లైన్ పోల్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. “అమెరికాలోని 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమా?” అనే ప్రశ్నతో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో మస్క్ ఓ పోల్ పెట్టారు. ఆశ్చర్యకరంగా దీనికి 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఫలితాలతో మస్క్ భావోద్వేగానికి లోనై ‘ది అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త పార్టీపై పోస్టు కూడా పెట్టేశారు.

ఈ చర్యలతో పాటు ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు మస్క్ అధికారికంగా కొత్త పార్టీ స్థాపన గురించి ప్రకటించకపోయినా, పరోక్షంగా మాత్రం ఆ దిశగా సంకేతాలు పంపుతున్నారు. మస్క్ సామాజిక మాధ్యమాల్లోని విప్లవాత్మక అభిప్రాయాలు, సాంకేతిక రంగంలో విజయాలు, విశాలమైన ఫాలోయింగ్ ఉండడంతో ఈ రూట్లో కూడా ఆయన విజయాన్ని అందుకునే అవకాశం లేకపోలేదు.

అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీ స్థాపన సాధ్యమవుతుందా? అనేది చర్చకు వస్తే, మస్క్ లాంటి ప్రభావశీలి నేత రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల వేదనలపై దృష్టిసారించే, టెక్నాలజీతో పాలనలో మార్పులు తేవాలన్న సంకల్పంతో మస్క్ నూతన దిశగా అడుగులు వేస్తే, అది అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.