భారత చెస్ ఆశల కిరీటంగా ఎదిగిన యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్… ఈమధ్య బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. అతను గెలిచిన వీడియోలు కూడా మీమ్స్ తరహాలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలా రోజుల తరువాత గుకేశ్ ఆటకు చెక్ పడింది. నార్వే చెస్ 2025 టోర్నమెంట్‌ను గెలిచే అంచుల వరకు వెళ్లినా, చివర్లో చేసిన చిన్న తప్పిదం అతని కలలను చెదరగొట్టింది.
టోర్నీ చివరి రౌండ్ వరకూ అద్భుతంగా ఆడి అభిమానుల ఆశలను మోసుకెళ్లిన గుకేశ్, చివరి క్షణాల్లో ఒక్క పొరపాటుతో టైటిల్‌ను చేజార్చుకున్నాడు. పదో రౌండ్‌కు ముందు గుకేశ్.. మాగ్నస్ కార్ల్సన్ మధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండటంతో ఇది నిర్ణాయక పోరుగా మారింది. కార్ల్సన్ తన గేమ్‌ను గెలిచి తన పని తాను చేసినప్పటికీ, గుకేశ్ కూడా కనీసం డ్రా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాతో గుకేశ్ తలపడిన ఆఖరి గేమ్ నిరాశగా ముగిసింది. ఆట చివరి క్షణాల్లో తీవ్ర సమయ ఒత్తిడిలో నైట్ ఫోర్క్‌కు చిక్కిన గుకేశ్ వెంటనే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఓటమితో టైటిల్ ఆశలు కూడా ఆవిరయ్యాయి. గేమ్ అనంతరం తీవ్రంగా దిగులుగా కనిపించిన గుకేశ్, ఒక్క చిన్న తప్పిదమే తన కలల్ని చీల్చేసిందని భావించినట్టు కనిపించింది.
మరోవైపు కార్ల్సన్ మాత్రం మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇటీవల గుకేశ్‌తో జరిగిన ఓటమిని స్వయంగా అంగీకరిస్తూ, అది నాకు నిరాశ కలిగించిన మ్యాచ్ అన్నాడు. అయినప్పటికీ, పోటీ చివర్లో తన క్లాస్ చూపించి మళ్లీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఈ ఘటన మరోసారి చెస్‌లో ఒక్క క్షణం ఎంత ప్రాముఖ్యమో గుర్తు చేసింది. గుకేశ్ వయసుతోనూ, ప్రతిభతోనూ ఇంకెన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నది మాత్రం స్పష్టమే. ఈ ఓటమి గుకేశ్‌కు పాఠం కావొచ్చు కానీ, ప్రపంచ వేదికపై అతని పయనం మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates