ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ సంస్థకు భారత ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ మంజూరు చేయడం టెలికాం రంగంలో పెద్ద పరిణామంగా మారింది. ఇప్పటికే రిలయన్స్ జియోకి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ భాగస్వామ్య సంస్థ వన్‌వెబ్ భారత మార్కెట్లో ప్రవేశించాయి. ఇప్పుడు స్టార్‌లింక్ వేదికపైకి రావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మూడు ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ మొదటగా సేవా పరిధిపై ఆధారపడి ఉంటుంది. ఇండియాలోని ట్రైబల్, రిమోట్ ఏరియాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడమే శాటిలైట్ ఇంటర్నెట్ ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలో స్టార్‌లింక్ ముందే ఆధునిక శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో సేవలు అందిస్తున్న స్టార్‌లింక్ అనుభవాన్ని ఉపయోగించుకుంటే, భారతదేశంలోని అనుసంధాన లోపాలను త్వరగా తగ్గించగలదు.
ఇకపోతే ధరల విషయంలో పోటీ గట్టిగానే ఉండనుంది. మస్క్ సంస్థ గ్లోబల్‌గా అధిక ధరలకు సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. భారత మార్కెట్‌కు తగ్గట్లు ప్రీసింగ్ను తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. వన్‌వెబ్, జియో శాటిలైట్ సంస్థలు దేశీయ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మునుపటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అందువల్ల స్టార్‌లింక్‌కి తక్కువ ధరలో సేవలు అందించడమే మొదటి సవాల్ అవుతుంది.
గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్ మరియు ఎడ్యుకేషన్ రంగాల్లో శాట్‌కామ్ సేవలతో అనుసంధానం కూడా కీలకం కానుంది. ఈ అవకాశాలను పట్టించుకునే స్థాయిలో తక్కువమందే ఉన్నారు. మస్క్ కంపెనీకి గ్లోబల్ బ్రాండ్ విలువ ఉన్నప్పటికీ, ప్రభుత్వ అనుమతులు, వాడుకదారుల ఆదరణ సాధించడం తేలికకాదు. అంతే కాకుండా, స్పెక్ట్రమ్ కేటాయింపు, భద్రతా ప్రమాణాల అంశాలు కూడా కీలకం.
మొత్తానికి చూస్తే, స్టార్‌లింక్ ఎంట్రీతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలో పోటీ మరింత తీవ్రమవుతుంది. దీని లాభం వినియోగదారులకు గరిష్ట సేవల నాణ్యత, తక్కువ ధరల రూపంలో రావొచ్చు. కానీ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే మస్క్‌కు ఇంకా ఎన్నో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates