ట్రంప్ తో కిరికిరి.. ఒక్కరోజే 12 లక్షల కోట్లు ఆవిరి!

అమెరికాలో రాజకీయ రంగంలో మాటల యుద్ధం షేర్ మార్కెట్‌ను తాకుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తెరపైకి వచ్చిన వివాదం టెస్లా షేర్లను మట్టికరిపించింది. ఒక్కరోజే టెస్లా షేర్లు 14 శాతం వరకు క్షీణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. ఇది టెస్లా చరిత్రలోనే రోజు వ్యవధిలో వచ్చిన అతిపెద్ద నష్టం. 2024 చివరినుంచి తిరిగి ట్రాక్‌లోకి వస్తోన్న టెస్లా షేర్లకు మస్క్ వ్యాఖ్యలు, ట్రంప్ హెచ్చరికలు కుడా పెద్ద దెబ్బే అన్న మాట.

ఈ పరిణామానికి నేపథ్యం అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. ప్రభుత్వ బడ్జెట్ వ్యయాలపై మస్క్ చేసిన విమర్శల నేపథ్యంలో, ఆయన వ్యాపారాలకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామంటూ ట్రంప్ పేర్కొనడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ‘‘ఎలాన్‌ను వెళ్లిపోమని చెప్పాను, అతడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు మస్క్‌ను తీవ్రంగా ఆగ్రహింపజేశాయి. వెంటనే మస్క్ కూడా “నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయేవారు” అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఈ దాడిపోరుతో పాటు టెస్లా అమ్మకాలు స్వల్పంగా పడిపోవడం, ఈవీ ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా షేర్ల పతనానికి తోడైంది. కానీ ట్రంప్ వ్యాఖ్యల తర్వాత మాత్రమే షేర్ల విలువ ఒక్కసారిగా పడిపోయింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు రోజులు నష్టాలే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బలమైన మే నెల గణాంకాల తర్వాత ఇలా ఒక్కరోజే భారీగా పడిపోవడం మార్కెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇప్పటివరకు టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో ఉండేది. ఇప్పుడు మాత్రం 916 బిలియన్లకు పడిపోయింది. ట్రంప్, మస్క్ మధ్య ఈ వివాదం ఇంకా కొనసాగితే, టెస్లా మార్కెట్ పునరుత్థానం పై మరింత సందేహాలు నెలకొనే అవకాశం ఉంది. రాజకీయ నేతల మాటలు అంతే కీలకమని స్టాక్ మార్కెట్ మరోసారి చూపించింది.