చెప్పినంత సులువు కాదు.. విజయోత్సవాలు నిర్వహించాలంటే. ముందుగా పక్కా ప్రణాళిక ఉండాలి. కానీ బెంగళూరులో ఆర్సీబీ విజయాన్ని జరుపుకునే వేళ జరిగిన తొక్కిసలాట ఘటన చూస్తే ఆ ప్రణాళిక పూర్తిగా క్లారిటీ లేనట్లు స్పష్టమవుతోంది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని తీసుకురాగా, అదే వేళ ఆనందం విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 45 మందికి పైగా గాయపడటంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొదటిగా సన్మాన కార్యక్రమం హడావుడిగా చేపట్టినట్లు ప్రకటించగా, తాజాగా వెలుగులోకి వచ్చిన లేఖ మాత్రం ఇది ముందే ప్రణాళికలో ఉన్న వ్యవహారమని నిరూపిస్తోంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) జూన్ 3వ తేదీనే విధాన సౌధ వద్ద సన్మానం నిర్వహించేందుకు అనుమతి కోరిన లేఖ ప్రభుత్వ శాఖల మధ్య తిరిగినట్లు సమాచారం. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రతిష్టకరమైన హడావుడిగా కాదు, అధికారుల మధ్య సమన్వయం లోపించిందని తెలుస్తోంది.
అయితే పోలీసుల వైపు నుంచి మాత్రం స్పష్టమైన హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. కార్యక్రమాన్ని బుధవారం కాకుండా ఆదివారం జరిపితే భద్రతా సమస్యలు తలెత్తవని సూచించారు. వీరంగంగా మారే అవకాశాలను ముందుగానే వారు పసిగట్టి చర్చించారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం మాత్రం ఆటగాళ్లలో చాలామంది, ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు అప్పటికే భారత్ విడిచి వెళ్తారని చెప్పడంతో అదే రోజున వేడుకకు తలపెట్టినట్టు తెలిసింది.
ఇక్కడ అసలైన సమస్య ఎక్కడ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అనుమతులు ఉన్నా, భద్రతా వ్యవస్థ అంధకారంలో ఉండటం, ఏర్పాట్లు సరైన సమన్వయంతో జరగకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకుంది. లక్షలాది మంది తరలివచ్చే వేళ కనీసం గేట్లు తెరవకపోవడమే బీభత్సానికి దారి తీసింది.
ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించినా, ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం మండుతోంది. ఒక గెలుపును వేడుకగా కాకుండా దుర్ఘటనగా మలచిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికార వ్యవస్థ ముందుగానే మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates