తొలి ఐపీఎల్ ట్రోఫీతో బెంగుళూరులో అడుగుపెట్టిన జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో అపశృతి జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు అభిమానులు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరికొందరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన అభిమానులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులను, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేశారు. దీంతో, చిన్న స్వామి స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, నిన్న అర్థరాత్రి నుంచి ఆర్సీబీ అభిమానులతో పాటు కన్నడిగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూరు హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ వరకు విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం లోపలికి ఒక్కసారిగా వెళ్లేందుకు అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో అభిమానులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు.