RCBని గెలిపించింది పంజాబ్ ప్లేయరే..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీకి దూరంగా ఉండే శాపాన్ని చెరిపేసింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టైటిల్‌ను అందుకుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీకి ఇది భావోద్వేగానికీ, గౌరవానికీ, కృషికి ఫలితానికీ నిదర్శనం అయ్యింది. 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్షణాన్ని ఆస్వాదించేలా సమిష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది బెంగళూరు జట్టు.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి మద్దతుగా మయాంక్ అగర్వాల్(24), పాటిదార్(26), లివింగ్‌స్టోన్(25), జితేశ్ శర్మ(24) అవసరమైన వేగంతో స్కోరు ముందుకు నడిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), జెమీసన్(3/48) మెరుగైన బౌలింగ్ చేశారు.

లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ, మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడిపోవడం గుణింతమైన ఒత్తిడికి దారితీసింది. శశాంక్ సింగ్ మాత్రం చివరి వరకు పోరాడుతూ 29 బంతుల్లో 61 పరుగులు(3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసినా విజయం మాత్రం అందించలేకపోయాడు.

పంజాబ్‌ ప్రారంభంలో ప్రియాంశ్ ఆర్య(24), ప్రభ్‌సిమ్రన్(26) కలిసి 43 పరుగులు జోడించగా.. హజెల్‌వుడ్ వారిని విడదీశాడు. కృనాల్ పాండ్యా రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌కు మలుపు తిప్పాడు. ఇంగ్లిస్(39), వధేరా(15), స్టోయినిస్(6) ఒక స్థిరతనివ్వలేకపోయారు. చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమవగా, శశాంక్ మూడు సిక్సులు, ఓ ఫోర్ కొట్టి పోరాడినా, అవసరమైనంత ప్రయోజనం లేకుండా పోయింది.

నిజానికి RCB గెలవడానికి ప్రధాన కారణం పంజాబ్ ప్లేయర్. అతను మరెవరో కాదు.. వధేరా. ఫైనల్ మ్యాచ్ లో అతను 18 బంతులలో 15 పరుగులు మాత్రమే చేశాడు. అతనొక్కడు సరిగా ఆడి ఉండి ఉంటే చివర్లో శశాంక్ పై భారం పడేది కాదు.  ఒత్తిడి ఉన్న సమయంలో బంతులను వృధా చేయడం RCBకి ధైర్యాన్ని ఇచ్చింది. స్టోయినిస్ ను ముందే దింపి ఉంటే అతను కాస్త కుదురుకొని చెలరేగే వాడు. అది కూడా పంజాబ్ ఓటమికి ముఖ్య కారణం.

ఇక ఆర్సీబీ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా(2/17), భువనేశ్వర్ కుమార్(2/38) కీలకంగా నిలిచారు. షెఫర్డ్, హజెల్‌వుడ్, యశ్ దయాల్‌లు తలో వికెట్ తీసి పంజాబ్ దూకుడును నియంత్రించారు. ఆఖరి ఓవర్‌ను అత్యంత అనుభవంతో వేసిన హజెల్‌వుడ్, విజయం ఖరారు చేశాడు. ఈ విజయం కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. 18 సీజన్ల తర్వాత ఎట్టకేలకు టైటిల్‌ను ఎత్తిపట్టిన అతను భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో రియాక్ట్ అయ్యాడు. ఈ గెలుపు ఆర్సీబీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.