రోహిత్ వారసుడు అతనే.. కానీ

భారత టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు గత కొన్ని రోజులుగా అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మీడియాలో ఉన్న ప్రచారాన్నే నిజం చేస్తూ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కొత్త సారథిగా ప్రకటించింది బీసీసీఐ. కొన్నేళ్లుగా జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తన స్థానంలో ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంటారా.. లేక కొత్త సారథిని ప్రకటిస్తారా అనే చర్చ జరిగింది.

ఐతే బుమ్రా తరచూ గాయాల పాలవుతుండడంతో అతణ్ని వైస్ కెప్టెన్‌గా కూడా పక్కన పెట్టి శుభ్‌మన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. కెప్టెన్సీ విషయంలో పెద్దగా సర్ప్రైజ్‌ ఏమీ లేనట్లే. కానీ జట్టులో మాత్రం కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. వన్డేల్లో అదరగొడుతూ, ఐపీఎల్‌లో కూడా పంజాబ్ జట్టును గొప్పగా నడిపిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అనుభవం ఉంది, ఫామ్ కూడా సూపర్. రంజీల్లోనూ రాణించాడు. ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. అయినా శ్రేయస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కపోవడం ఆశ్చర్యకరం.

శ్రేయస్‌తో పాటు మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో చెన్నై జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్‌కు దేశవాళీల్లో మంచి రికార్డుంది. అయినా అతణ్ని కాదని అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటిచ్చారు. ఇక అనుకున్నట్లే తమిళనాడు కుర్రాడు, ఐపీఎల్‌లో గుజరాత్ తరఫున అదరగొడుతున్న సాయి సుదర్శన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సరైన ఫాంలో లేకపోయినా.. టెస్టు జట్టులో చోటు నిలుపుకున్నాడు.