ప్రస్తుతం యువత పెళ్లిపై భిన్న అభిప్రాయాలతో కనిపిస్తున్నారు. కొంతమంది పెళ్లికి దూరంగా ఉండటం ఇష్టపడుతున్నారు. మరికొందరు మాత్రం కుటుంబం, సమాజం ఒత్తిడితో మౌనంగా ఒప్పుకుంటున్నారు. అయితే ఈ వివాహ వ్యవస్థలోని అంచనాలు, ఒత్తిళ్లు కొంతమందిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ శివారులో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఈ సమస్యను మళ్లీ వెలుగులోకి తెచ్చింది.
32 ఏళ్ల ప్రవీణ్ గౌడ్ అనే యువకుడు పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదని మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని కన్నుమూశాడు.
ఇది కేవలం వ్యక్తిగత విషాదం కాదు, సమాజం మీద ప్రశ్నలు వేయించే సంఘటన. పెళ్లి ఎందుకు చేయాలి? అది జీవితంలోని అవసరమా? లేక సమాజం కుదించిన ఒత్తిడికా? అనే ప్రశ్నలు ఇలాంటి ఘటనల వల్ల ముందుకొస్తున్నాయి. పెళ్లి లేకపోతే జీవితానికి అర్ధం లేదన్న భావన ప్రమాదకరం.
ఇప్పుడు కాలం మారింది. యువత తమ జీవితం గురించి స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. కెరీర్, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచులపై దృష్టి పెడుతున్నారు. ఇలా ఆలోచించడం తప్పేమీ కాదు. పెళ్లి కావాల్సిందే అన్న బలవంతం ఒకరి జీవితాన్ని బరువుగా మార్చవచ్చు. పైగా సంబంధాలు కుదరడం లేదని బాధ పడటం కన్నా, జీవితం పట్ల ఆత్మవిశ్వాసం పెంచుకోవడమే ముఖ్యం. వివాహం వ్యక్తిగత నిర్ణయం. అది రాలేదని జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు.