ఐపీఎల్ జట్ల రాతలు మార్చేస్తున్న సూపర్ కెప్టెన్

ఐపీఎల్ మొద‌ల‌వుతుంటే.. అతి త‌క్కువ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగే జ‌ట్ల‌లో పంజాబ్ కింగ్స్ ఒక‌టి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో మొద‌లై త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌గా మారిన ఈ జ‌ట్టు ఇప్ప‌టిదాకా ఒక్క‌సారి కూడా క‌ప్పు కొట్ట‌లేదు. టైటిల్ సాధించ‌డం సంగ‌తి త‌ర్వాత.. క‌నీసం ప్లేఆఫ్స్ చేర‌డం కూడా ఆ జ‌ట్టుకు పెద్ద టాస్కే. గ‌త ప‌దేళ్ల‌లోలో ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా గ్రూప్ ద‌శ‌ను దాట‌లేదు ఆ జ‌ట్టు. ఇంత పేల‌వ‌మైన రికార్డు ఐపీఎల్‌లో మ‌రే జ‌ట్టుకూ లేదు. మూడేళ్ల ముందు లీగ్‌లోకి వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్, ల‌క్నో సూప‌ర్ జెయంట్స్ కూడా ఆక‌ట్టుకోగా.. పంజాబ్ మాత్రం పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ వ‌చ్చింది.

అలాంటి జ‌ట్టు ఈ సీజ‌న్లో అద‌ర‌గొట్టింది. నిల‌క‌డ‌గా ఆడుతూ పాయింట్ల ప‌ట్టిక‌లో పైన కొన‌సాగింది. ఇప్పుడు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే ప్లేఆఫ్స్‌కు కూడా అర్హ‌త సాధించింది. ఇన్నేళ్ల‌లో ఎన్న‌డూ లేని ఈ మార్పుకు కార‌ణం ఎవ‌రు అంటే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ అనే చెప్పాలి. అత‌ను జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టాడో లేదో పంజాబ్ రాత మారిపోయింది. రికీ పాంటింగ్ కోచ్, శ్రేయ‌స్ కెప్టెన్ కావ‌డం, మంచి జ‌ట్టును ఎదుర్కోవ‌డం.. ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆడి గెల‌వ‌డంతో పంజాబ్ కింగ్స్ ప‌దేళ్ల త‌ర్వాత ప్లేఆఫ్స్ చేర‌గ‌లిగింది. శ్రేయ‌స్ సూప‌ర్ కెప్టెన్ అన‌డానికి ఇదొక్క‌టే రుజువు కాదు.

గ‌త ఏడాది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టును అత‌ను విజేత‌గా నిలిపాడు. అదే జ‌ట్టు ఈ సీజ‌న్‌లో అత‌ను లేకుండా ప్లేఆఫ్స్‌కు కూడా అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. ప‌దేళ్ల విరామం త‌ర్వాత కోల్‌క‌తాకు క‌ప్పు సాధించి పెట్టిన ఘ‌న‌త శ్రేయ‌స్ సొంతం. అత‌ను ఆ జ‌ట్టును వదిలి రాగానే ప్ర‌ద‌ర్శ‌న ప‌డిపోయింది. జ‌ట్టు పెద్ద‌గా మార‌క‌పోయినా ఇలా ప‌త‌నం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం శ్రేయ‌స్ లేక‌పోవ‌డ‌మే అని చెప్పొచ్చు. శ్రేయ‌స్ దీని కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు ఆ జ‌ట్టు తొలిసారిగా ఫైన‌ల్ ఆడింది. అత‌నా జ‌ట్టును వీడ‌గానే దాని ప్ర‌ద‌ర్శ‌నా దెబ్బ తింది. ఇలా ఐపీఎల్‌లో మూడు జ‌ట్ల రాత‌ను మార్చేసిన సూప‌ర్ కెప్టెన్‌గా శ్రేయ‌స్‌ను చెప్పుకోవ‌చ్చు. ఐపీఎల్‌లో త‌న రికార్డును చూసి టీమ్ ఇండియాకు కూడా ఏదో ఒక ఫార్మాట్లో కెప్టెన్‌ను చేయాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.