కోహ్లీ గుడ్‌బై.. BCCI ప్లాన్ పనిచేయలేదా?

భారత టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ చెప్పిన గుడ్‌బై క్రికెట్ అభిమానుల హృదయాలను కదిలించే నిర్ణయంగా మారింది. 14 ఏళ్ల పాటు భారత జెర్సీలో దూకుడుగా దూసుకెళ్లిన విరాట్ కోహ్లీ, టెస్టు ఫార్మాట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, “ఇది నా జీవితంలోని ఒక గొప్ప ప్రయాణం. ఇప్పుడు దాన్ని ముగించాలనే సమయం ఆసన్నమైంది” అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.

అయితే కోహ్లీ ఇదివరకే రిటైర్మెంట్ పై బీసీసీఐ తో మాట్లాడడం జరిగింది. కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా కోహ్లీ మరోసారి ఆలోచించుకోవాలి అని చెప్పారు. అంతే కాకుండా జట్టుకు ఇలాంటి సమయంలో నీ లాంటి సీనియర్ క్రికెటర్ అనుభవం చాలా అవసరం అని మాజీ ఆటగాళ్లు కూడా చెప్పారు. ఈమద్యే రోహిత్ తప్పుకోవడం, ఇప్పుడు కోహ్లీ కూడా దురమవ్వడంతో జట్టులో అనుభవ లోపం వల్ల ప్రభావం పడవచ్చు అనే అభిప్రాయం వస్తోంది. ఇక బీసీసీఐ ప్రముఖ ఉన్నతాధికారులలో ఒకరు విరాట్ తో ప్రత్యేకంగా మాట్లాడినప్పటికి వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.

విరాట్ కు ఇప్పుడు ఇద్దరు పిల్లలు.. ఇక తన ఫ్యామిలీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీసీసీఐ కోహ్లీ నిరణాయాన్ని వెనక్కి లాగలేకపోయింది. 2011లో వెస్టిండీస్‌పై జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన కోహ్లీ, ఆ తర్వాత భారత జట్టులో కీలక స్థానాన్ని సంపాదించారు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో అద్భుతమైన గణాంకాలను నమోదుచేశారు. కోహ్లీ సారథ్యంలో భారత్ విదేశాల్లో గెలుపొందిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌లో సిరీస్ గెలిచిన తొలితరం కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.

వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే కొత్త టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్‌కు ముందు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఊహించని పరిణామం. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్ట్ ఆడిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కోహ్లీ తర్వాత యువ ఆటగాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి టాలెంటెడ్ బ్యాటర్లు కొత్త దశను ముందుకు నడిపించాల్సి ఉంది. కానీ కోహ్లీ లాంటి ఆటగాడి అనుభవాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు.