నూనూగు మీసాల నూత్న యవ్వనంలోకి అడుగుపెట్టిన యువకుడు.. దేశం కోసం జరిగిన పోరాటంలో వీరమరణం చెంది.. చెక్క పెట్టెలో పార్థివ దేహంగా పడుకున్న తీరు కన్నవారిని కుమిలిపోయేలా.. కడుపు రగిలిపోయేలా చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. వచ్చే ఏడు మనువు పెట్టుకున్నాం.. నా కడుపు కాలిపోయింది! అంటూ.. దేశానికి వీరుడిని ప్రసాదించిన జ్యోతిబాయి విలపించిన తీరు.. కన్నీళ్లకు సైతం జాలి కలిగి.. ఇంకిపోయాయి.!
ఒక్కగా నొక్క బిడ్డ.. లేక లేక పుట్టిన మగ పురుగు దేశం కోసం త్యాగం చేశామన్న గర్వం ఉన్నా.. దాని వెనుక.. తమ నలుసు తిరిగి రాడని.. తమ కడుపు కోత తీరదని పడుతున్న ఆవేదన.. బాధ జ్యోతిబాయి దంపతులను ఓదార్చలేని స్థితికి తీసుకువెళ్లింది. పుట్టుకతోనే దేశ భక్తిని పేగు బంధంగా మార్చుకుని పుట్టిన వారి గురించి స్వతంత్ర సమర కాలంలో బాగా పేరు వినిపించేది.
కానీ.. ఇటీవల కాలంలో పుట్టుకతోనే దేశ భక్తి సుగంధాలను తల్లి కడుపులోనే పెనవేసుకుని నేలపై పడ్డ మురళి.. నిజంగా దేశం గర్వించదగ్గ బిడ్డ!. అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం.. అత్యంత మారు మూల తండా.. కుళ్లి. ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. పట్టుమని చదువుకునే వసతులు కూడా లేవు. పైగా దేశ భక్తి, సైన్యం గురించి చెప్పే వారు అంతకన్నా లేరు. అయినా.. దేశ భక్తి అబ్బడం.. దేశం కోసం ఒక్కరోజైనా పనిచేస్తానన్న పట్టుదల రావడం ఖచ్చితంగా విశేషమే.
పైగా సంచారం చేసుకుని కడుపు నింపుకొనే కుటుంబం.. ఇన్ని సవాళ్లు ఉన్న కుటుంబంలో మురళీ నా యక్ పురుడు పోసుకున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళించిందన్న సరోజినీ నాయుడు వ్యాఖ్యలను నిజం చేసేలా పుట్టుకతోనే.. మురళి.. దేశ భక్తిని పుణికి పుచ్చుకున్నాడు. ముంబైలో పనుల కోసం వెళ్లిన సమ యంలో అక్కడే నెలలు నిండి జన్మించిన మురళీ.. చిన్న వయసు నుంచే బొమ్మ తుపాకులతో ఆడుకు న్నాడని ఆ తల్లి కన్నీటి ధారల నడుమ చెప్పిన తీరు.. మురళికి దేశభక్తి అబ్బిన విధానాన్ని చెప్పకనే చెబుతుంది!.
‘సైన్యం గోల మనకొద్దురా అయ్యా!’ అని కన్న తండ్రి శ్రీరాం నాయక్ పదే పదే చెప్పినా.. అర్జునుడికి చెట్టుపై పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మురళీ నాయక్‌కు.. దేశ సరిహద్దులు.. దేశ భక్తి మాత్రమే పొడచూపాయి. ఫలితం గా 19 ఏళ్ల వయసులోనే ప్రాక్టీస్ ప్రారంభించి.. 20 ఏళ్ల వయసులో అగ్నివీర్ (తొలి బ్యాచ్)కు ఎంపిక కావడం గమనార్హం. ఇలా.. తన దేశ భక్తి ప్రయాణం.. ఆపరేషన్ సిందూర్ లో నూనూగు మీసాల వయసులో అమరు డిగా నిలిచేలా చేసింది. ఇలా జరిగి ఉండకపోతే.. వచ్చే ఏడాది మురళీ పెళ్లి ఘనంగా జరిగి ఉండేదని.. ఆయన మేన మామ చెప్పడం గమనార్హం.
కాగా.. ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో జరిగిన దాడుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ.. సాగిన నేపథ్యంలో యావత్ తెలుగు వారు మురళి దేశ భక్తిని ప్రస్థుతిస్తూ.. ఘన నివాళులర్పిస్తున్నారు.