యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు ఎవరి పక్షాన వెళ్లనున్నాయన్న విషయం గంట.. గంటకు మారుతున్న వేళకు కాస్త ముందుగా ట్రంప్ మాట్లాడారు. ఓటమి కంటే గెలుపు సులువని చెప్పిన ఆయన.. తన ప్రత్యర్థి డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు చాలా కష్టసాధ్యమని పేర్కొన్నారు.
అదే సమయంలో తాను గెలుపోటముల గురించి ఇప్పుడు ఆలోచించటం లేదన్న ఆయన..తనదైన ఫిలాసఫీని చెప్పుకొచ్చారు. పోలింగ్ జరుగుతున్న వేళలో.. వర్జీనియా రాష్ట్రంలోని ఆర్లింగ్టన్ పట్టణ ఎన్నికల కార్యాలయాన్ని ట్రంప్ సందర్శించారు. గెలుపు .. ఓటమి ఎప్పటికి సులువు కాకపోవచ్చన్న మాటలు ఆయన తీరును చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి.
తన వరకు వస్తే.. గెలుపే తేలికన్నట్లుగా ఆయన మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చేయాల్సిన ప్రసంగాల గురించి తాను ఇప్పుడు ఆలోచించటం లేదన్న ఆయన.. ఆ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అటు ఇటుగా మారుతున్న ఫలితాలపై స్పష్టత రావటానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates