ఏపీ పోలీసులు విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఏపీ పోలీసులు తాజాగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలను కాపాడారు. ఇందుకోసం ఏపీ పోలీసులకు కేవలం 20 నిమిషాలు సరిపోయాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన తిరుపతిలోని రామచంద్రాపురం పరిధి రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మానసికంగా కుంగిపోయిన సదరు విద్యార్థి ఆత్మహత్యకు దాదాపుగా సిద్ధమైపోయాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన సదరు విద్యార్థి… నేరుగా రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచే అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపాడు.
దీంతో వెనువెంటనే స్పందించిన అతడి మిత్రులు విషయాన్ని అతడి తల్లిదండ్రులతో పాటుగా అలిపిరి పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. ఈ ఫిర్యాదుపై అలిపిరి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి బొడ్డు హేమంత్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి బాదితుడు రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి తరలించారు.
మొన్నామధ్య కాకినాడ జిల్లాలోనూ ఇదే తరహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధం కాగా…ఆ జిల్లా పోలీసులు పొరుగు జిల్లాల పోలీసుల సహకారం తీసుకుని… కేవలం ఆరంటే ఆరు నిమిషాల్లో అతడిని కాపాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో నిమిషం ఆలస్యమైనా కూడా బాధితుడు లాడ్జీలోని ఫ్యానుకు విగత జీవిగా వేలాడేవాడే. అయితే పోలీసుల సమయస్ఫూర్తి, సాంకేతికత వినియోగంతో ఆ వ్యక్తిని కాపాడారు. వెరసి పనితీరులో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates