భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతి సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా భారత జట్టు సభ్యులకు వార్షిక వేతనం అందజేస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B, C అనే నాలుగు గ్రేడ్లలో వర్గీకరిస్తారు. A+ గ్రేడ్‌లో ఉన్నవారు రూ.7 కోట్లు, A గ్రేడ్‌కి రూ.5 కోట్లు, B గ్రేడ్‌కి రూ.3 కోట్లు, C గ్రేడ్‌కి రూ.1 కోటి వార్షిక పారితోషికం లభిస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి. ఇది ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా, జాతీయ జట్టుతో వారి స్థిరతను సూచించే గుర్తింపు కావడం విశేషం.
ఇప్పుడు BCCI కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కనుందని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ ఇటీవల టీ20ల్లో అద్భుతంగా రాణించాడు. 17 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతను, బీసీసీఐ విధించిన “గత ఏడాదిలో కనీసం 10 టీ20లు ఆడాలి” అన్న నిబంధనను పూర్తిగా అందుకున్నాడు. అందువల్ల అతనికి C గ్రేడ్ కాంట్రాక్ట్ అంటే రూ.1 కోటి వార్షిక వేతనం దక్కే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి, ఇటీవల ఆసీస్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడాడు. ఇది BCCI ప్రామాణికత ప్రకారం సరిపోతుంది. అతనికీ రూ.1 కోటి C గ్రేడ్ కాంట్రాక్ట్ ఖాయంగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఐదు, టీ20లో ఒకటి ఆడాడు. మూడు ఫార్మాట్లను కలిపితే అతనికి కూడా ఒక స్థిరమైన ప్రదర్శన ఉంది. కాబట్టి అతనికి కూడా అవకాశం ఉంది.
ఇక వరుణ్ చక్రవర్తి (18 టీ20లు, 4 వన్డేలు), శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లకూ తిరిగి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయన్నారు బీసీసీఐ వర్గాలు. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి స్టార్లు ఎప్పటిలానే A+ గ్రేడ్‌లో కొనసాగుతారు. రెండు రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. ఈ సారి యువతకు మంచి అవకాశాలు దక్కనున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates