టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్, లింగ మార్పు శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు అనయగా కొత్త జీవితం కొనసాగిస్తున్నారు. యూకేలో నివాసం ఉంటున్న అనయ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అనేక కీలక విషయాలను పంచుకున్నారు. చిన్ననాటి నుంచే తనలో అమ్మాయిగా ఉండాలన్న భావన బలంగా ఉండేదని, 8-9 ఏళ్ల వయస్సులోనే ఆ మార్పును గ్రహించానని ఆమె తెలిపారు.
క్రికెటర్‌గా ఉన్నప్పుడు అనయ.. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి పలువురు ప్రముఖ యువ క్రికెటర్లతో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తన వ్యక్తిగత పరిస్థితిని తండ్రి సంజయ్ బంగర్‌కు ఉన్న గుర్తింపు కారణంగా ఎవరితోనూ పంచుకోలేకపోయానని పేర్కొన్నారు. అందుకే మొదట క్రికెట్ వర్గాల్లో తన భావాలను గోప్యంగా ఉంచుకున్నానని చెప్పారు.
అయితే లింగ మార్పు అనంతరం తన జీవితంలో ఎదురైన పరిస్థితులపై కూడా అనయ ఓపెన్‌గా మాట్లాడారు. తన నిర్ణయాన్ని కొందరు ఆదరించగా, మరికొందరి నుంచి వేధింపులు ఎదురైనట్లు చెప్పారు. కొంతమంది క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపారని, మరికొందరు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. ఒకసారి ఓ మాజీ క్రికెటర్ తన పరిస్థితిని తెలియజేయగా, అతను తనతో కలిసి కారులో వెళ్లి గడపాలని చెప్పాడని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో అనయ వెల్లడించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ధైర్యంగా చెప్పిన నిజాలను ఎంతో మంది అభినందిస్తున్నారు. సమాజం మరింత సహానుభూతితో చూసే దిశగా ఆమె జీవిత ప్రయాణం మార్గదర్శకంగా నిలుస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాలను క్లియర్ గా చెప్పినప్పటికీ, ఇబ్బంది పెట్టిన వారి గురించి మాత్రం బయటకు చెప్పలేదు.