భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మెహుల్ చోక్సీ కొట్టిన దెబ్బతో పాతాళంలోకి పడిపోయింది. పీఎన్బీకి ఆయన 13 వేల కోట్ల పైచిలుకు రుణాలను ఎగవేసి… ఎంచక్కా భారత వదిలి పారిపోయారు. పీఎన్బీని ముంచేసిన చోక్సీ.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని అంతా అనుకుంటూ ఉంటే…చోక్సీ మాత్రం ఓ కొత్త కథను చెబుతున్నారు. పీఎన్బీని తాను మోసం చేస్తే.. తనను ఓ మహిళ నట్టేట ముంచేసిందని ఆయన వాపోతున్నారు. ఆ మహిళ తనను ఏకంగా కిడ్నాప్ చేసిందని ఆరోపించిన చోక్సీ.. ఇదంతా భారత్ ఆడిస్తున్న నాటకంగా అభివర్ణించారు.
పీఎన్బీ రుణాన్ని ఎగవేసి ఎంచక్కా దేశం దాటి వెళ్లిపోయిన చోక్సీ…ప్రస్తుతం పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే బెల్జియంలోని ఓ ఆసుపత్రికి చోక్సీ వెళ్లగా… ఆయనను గుర్తించిన అక్కడి పోలీసులు చోక్సీని అరెస్టు చేశారు. భారత్ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల కారణంగానే చోక్పీ బెల్జియం పోలీసులకు పట్టుబడిపోయారు. అరెస్టు సందర్భంగా వీల్ చైర్ కే పరిమితమైన చోక్సీని చూసి చాలా మంది ఆయనకు తగిన శాస్తి జరిగిందని శాపనార్థాలు కూడా పెట్టారు. చోక్సీ అరెస్టు గురించి తెలిసినంతనే రంగంలోకి దిగిన భారత్… ఆయనను తమకు అప్పగించాలని బెల్జియంను కోరింది. చోక్సీని భారత్ రప్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో చోక్సీ ఓ స్టోరీని వినిపించారు. భారత్ ను వదిలిపోయిన తర్వాత తనకు హంగేరీకి చెందిన బార్బరా జబారియా అనే మహిళ ట్రాప్ చేసిందని ఆయన ఆరోపించారు. తనను అరెస్టు చేసే దిశగా భారత్ ఓ వ్యూహాన్ని రచించిందని, అందులో బార్బరా కీలక భూమిక పోషించిందని తెలిపారు. తొలుత తెలియని వ్యక్తిగానే తన వద్దకు వచ్చిన బార్బరా.. ఆ తర్వాత తనకు ఫ్రెండ్ గా మారిపోయిందని, ఆ తర్వాత ఏకంగా తనను డిన్నర్ లకు ఆహ్వానించే దాకా వెళ్లిందని వివరించారు. ఈ క్రమంలోనే తనను కిడ్నాప్ చేసిన బార్బరా… తనపై వలపు వల విసిరి… తాను అరెస్టు అయ్యేలా చేసిందని ఆరోపించారు. తనను భారత్ కు రప్పించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే బార్బరా ఇలా తనను హనీ ట్రాప్ కు గురి చేసిందని ఆయన వాపోయారు.
చోక్సీ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించింది. చోక్సీనే తనను మోసం చేశారని ఆమె చెబుతున్నారు. తాను హంగేరీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా… తనతో పరిచయం పెంచుకునేందుకు చోక్సీ తన అసలు గుర్తింపును దాచి పెట్టారని ఆరోపించింది. చోక్సీ కారణంగా తాను నానా ఇబ్బందులు పడ్డానని ఆమె వాపోయారు. ఈ పరస్పర ఆరోపణల్లో ఎవరి మాట నిజమో తెలియదు గానీ… బంగారం లాంటి బ్యాంకును అధో:గతి పాలు చేసిన చోక్సీకి ఇలా జరగాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే భారత్ యత్నాలు ఫలించి చోక్సీని దేశానికి తిరిగి తీసుకువచ్చి… చట్టపరంగా శిక్షించాలన్న డిమాండ్ ఒకింత గట్టిగానే వినిపిస్తోంది.