ఇంగ్లిష్ రాదని ట్రోలింగ్.. క్రికెటర్ కౌంటర్

పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు. అలా ఎక్కువగా సోషల్ మీడియాలో నానే పేరు అంటే.. మహ్మద్ రిజ్వాన్‌దే. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్ అయిన రిజ్వాన్‌కు ఇంగ్లిష్ రాదు. చాలామంది పాక్ క్రికెటర్లకు ఇంగ్లిష్‌తో ఇబ్బందే కానీ.. రిజ్వాన్ పరిస్థితి మరీ ఘోరం. ఐతే ఇంగ్లిష్ రాదని అతను ఊరుకోడు.. తనకు వచ్చిన కొన్ని ఇంగ్లిష్ ముక్కల్నే యమ స్పీడుగా మాట్లాడేసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.

మ్యాచ్ ప్రెజెంటేషన్ల టైంలో.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు తన మాటలు చాలా కామెడీగా ఉంటాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. దీని మీద ట్రోలింగ్ మామూలుగా జరగలేదు. ఐతే ఈ ట్రోలింగ్ గురించి తాజాగా రిజ్వాన్ స్పందించాడు. తనకు ఇంగ్లిష్ రాదన్న విషయాన్ని అతను అంగీకరించాడు.

తాను పెద్దగా చదువుకోలేదని.. అలా చదువుకుని ఇంగ్లిష్ మీద పట్టు సాధించి ఉంటే ప్రొఫెసర్ అయ్యేవాడినని.. క్రికెటర్ కాదని అతను స్పష్టం చేశాడు. తనను ట్రోల్ చేసే వారిని తాను అస్సలు పట్టించుకోనని రిజ్వాన్ చెప్పాడు. తనకు క్రికెట్ వచ్చని.. తన నుంచి ఎవరైనా కావాలంటే క్రికెట్ నేర్చుకోవచ్చని.. అంతే తప్ప తన ఇంగ్లిష్ గురించి కామెంట్ చేస్తే తనకు అనవసరమని చెప్పాడు. ఒక ఆటగాడికి భాష కంటే ఆట ముఖ్యమని.. అది తన దగ్గర ఉందని.. తనను ట్రోల్ చేసే వాళ్లు చేసుకోవచ్చని అతను తేల్చి చెప్పాడు. రిజ్వాన్ మాటలు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. అతడికి బాగానే మద్దతు లభిస్తోంది.